యాకూబ్‌ మెమన్‌ గురువారం తెల్లవారుజామున నాగ్‌పూర్‌లోని సెంట్రల్‌ జైలులో ఉరితీయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హైదరాబాదు నగరంలో కూడా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉగ్రవాద కార్యకలాపాల పరంగా హైదరాబాదు నగరం కూడా చాలా సునిశితమైన ప్రాంతం కావడంతో.. ఇక్కడ కూడా అల్లర్లు, విధ్వంసక కార్యకలాపాలు జరగవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో నగర వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. 


ఇస్లామిక్‌ ఉగ్రవాదపు జాడలు ప్రతిసారీ హైదరాబాదులో కూడా దొరుకుతూ ఉండడం అందరికీ తెలిసిన సంగతే. యాకూబ్‌ మెమన్‌ ముంబాయికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. హైదరాబాదులో కూడా అతనికి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్నదనేది పోలీసు వర్గాల సమాచారం. ఫాలోయింగ్‌ సంగతి పక్కన పెడితే.. నగరంలోని ముస్లిం వర్గాలు మొత్తం కూడా.. యాకూబ్‌ మెమన్‌ ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నది మాత్రం నిజం. కేవలం ముస్లిం కావడం వల్లనే అతడిని ఉరి తీస్తున్నారంటూ మజ్లిస్‌ పార్టీ సారధి అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఉరి సమయానికి, ఉరి తర్వాత నగరంలో కూడా ఏమైనా అల్లర్లు జరగవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు హైఅలర్ట్‌ ప్రకటించి.. అన్ని స్టేషన్లను అప్రమత్తంచేశారు. 
కాగా మెమన్‌ ఉరి నేపథ్యంలో ముంబాయి, నాగ్‌పూర్‌ నగరాల్లో ఇప్పటికే అధికారికంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. మహారాష్ట్ర డీజీపీ అక్కడి ముఖ్యమంత్రితో కలిసి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. నగరంలో తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. మహారాష్ట్ర గవర్నరు ఇవాళ మెమన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. హైఅలర్ట్‌ నేపథ్యంలో పలువురు పాత నేరస్తులను కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అయితే గురువారం నాడు పోలీసులకు సెలవును కూడా రద్దు చేసింది. నాగ్‌పూర్‌లో జైలు పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఉరిశిక్షపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ మతపెద్దలు ఇతరులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: