ఏపీకి ప్రత్యక హోదా ఇవ్వాలని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయి. వీటిలో ఒక్కో పార్టీది ఒక్కో పంథా.. కేంద్రంలో అధికారంలో ఉండటం టీడీపీ కాళ్లకు బంధనాలు వేస్తోంది. గట్టిగా మాట్లాడలేక.. నిలదీయలేక.. ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకముంది.. వచ్చేదాకా పోరాడతాం.. వంటి డైలాగులతో సరిపెడుతోంది. ప్రతిపక్షాలు మాత్రం ఈ అవకాశాన్ని వీలైనంతగా రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

ప్రత్యేక హోదాపై ఈనెలలోనే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని వైసీపీ డిసైడ్ చేసింది. దీక్షకు జగన్ సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ కూడా ఈ అంశం ఆధారంగా ఏపీలో దాదాపు మట్టిగొట్టుకుపోయిన పార్టీకి మళ్లీ ఊపిరిపోయాలని ప్రయత్నిస్తోంది. ఐతే.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కంటే ఓ పార్టీ మాత్రం హోదాపై పోరులో ముందు ఉంది. కాకపోతే.. మీడియా ఆ పోరును అంతగా పట్టించుకునే పరిస్థితి లేదు. 

ఆ పార్టీయే సీపీఐ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా- రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామిని నెరవేర్చాలంటూ శ్రీకాకుళం నుంచి హిందూపూర్‌ వరకు  సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామకృష్ణ.. ప్రత్యేక హోదా అరగంటలో వచ్చే ఐడియా చెప్పారు. 

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా ప్రకటిస్తారని రామకృష్ణ అంటున్నారు. పదేళ్లు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఉండాలని పార్లమెంటులో మాట్లాడిన వెంకయ్య.. ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. 10వ తేదీలోపు కేంద్రం ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే 11 వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. తమ యాత్రకు ప్రజా సంఘాలు, ప్రజల నుంచి విశేషంగా స్పందన లభిస్తుందని ఆయన చెప్పుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: