నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకే పోటీ చేస్తాననడం టీడీపీలో కొత్త చర్చకి దారి తీసింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని బాలకృష్ణ గతంలోనే చెప్పినప్పటికీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అయితే 2014 లో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు తన అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీకి గ్లామర్ అవసరం భావించిన చంద్రబాబు, బాలకృష్ణను రంగంలోకి దించుతున్నారు. బాలయ్యని లోక్ సభకు పంపాలని చంద్రబాబు భావించినప్పటికీ... ఆయన మాత్రం ఎమ్మెల్యేగానే పోటి చేస్తానని ప్రకటించారు. లోకసభకు పోటీచేస్తే ఏడు నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక్క స్థానానికి బాలయ్య ప్రభావం ఉంటుందని చంద్రబాబు భావించారు. అయితే చంద్రబాబు ఆశలపై బాలయ్య నీళ్లు చల్లారని ఆపార్టీ నేతలే అంటున్నారు. బాలయ్య శాసనసభలో అడుగుపెడితే మరో పవర్ సెంటర్ తయారయ్యే అవకాశం ఉందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. అయితే బాలయ్య అసెంబ్లీ కి పోటీ చేయటం ద్వారా మరో పవర్ సెంటర్ ఏర్పతుందన్న వాదన సరికాదని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. బాలయ్య పవర్ సెంటర్ కాదని పవర్ ఆఫ్ ఎట్రాక్షన్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు 2014 లో బాలకృష్ణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు చర్చ నీయాంశమైంది. గతంలో ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచా లేక కృష్ణా జిల్లా పెనుమలూరు నుంచా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిపదవుల విషయంలో, నామినేటెడ్ పోస్టుల విషయంలో బాలయ్య జోక్యం తప్పక ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాని వల్ల చంద్రబాబుకి ఇబ్బందులు తప్పవని తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుంచే వర్రీ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: