రాజ‌ధాని ప్రాంతంలో సినీ న‌టుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్  జ‌రిపిన ప‌ర్య‌ట‌న తో టీడీపీ మిత్ర ప‌క్షం జ‌న‌సేన మ‌ధ్య భారీ గానే వైరుద్యం నెల‌కొంది. రాజ‌దాని కోసం ఆంద్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌ట్టే భూసేక‌ర‌ణ వ్య‌తిరేకిస్తూ బాధిత రైతుల‌ను పరామ‌ర్శించేందుకు వెళ్లిన జ‌నసేనాని టీడీపీ ఎంపీలు, మంత్రుల‌పై దూకుడుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతో అధికార పార్టీ ఆత్మ‌సంర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ ఎంపీలు  కేశినేని నాని, ముర‌ళీమోహ‌న్, మంత్రులు రావెల కిశోర్ బాబు, ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డిల‌పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌ల‌కు దిగ‌డానికి ప‌వ‌న్ సంకోచించ‌క‌పోవ‌డంతో ప‌సుపు రంగు పార్టీ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఈ వివాదం మ‌రింత ముద‌ర‌క‌ముందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో రాజీ ప‌డ‌టానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మ‌చారం. ఇంత‌కీ రాజ‌ధాని ప్రాంతంలో త‌న ప‌ర్య‌ట‌న ద్వారా ప‌వ‌న్ సాధించిదేమిట‌న్న‌ది తెలియాల్సి ఉంది.

గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు


గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మండ‌లాల్లోని 29 గ్రామాల్లో రాజ‌ధాని నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యించారు. దానికి అనుగుణంగానే ప‌లు గ్రామాల‌కు చెందిన రైతుల్లో  ఎక్కువ మంది ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన భూ  స‌మీక‌ర‌ణ ప‌థ‌కం లో త‌మ భూముల‌ను ఇచ్చారు. అయితే పెనుమాక‌, ఉండ‌వ‌ల్లి, బేత‌పూడి త‌దిత‌ర గ్రామాల‌కు చెందిన కొంద‌రు రైతులు మాత్రం ఏ రూపంలో కూడా త‌మ భూముల‌ను రాజ‌ధాని నిర్మాణానికి అంగీక‌రించేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఎంత ప్ర‌య‌త్నించినా రైతులు త‌మ ప‌ట్టు వ‌ద‌ల్లేదు. దాంతో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించ‌ని రైతుల భూములు తీసుకునేందుకు భూ సేక‌ర‌ణ నోటిఫికేష‌న్ కూడా ఇచ్చింది. భూ సేక‌ర‌ణ ద్వారా రైతుల భూముల‌ను తీసుకోవ‌టానికి ప‌వ‌న్ కూడా తొలి నుంచి వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. అయితే ట్వీట్ట‌ర్ ప‌వ‌న్ అభిప్రాయాలు పంచుకుంటూనే ఉన్నారు. ప్ర‌భుత్వం కూడా త‌న ప‌ని తాను చేసుకుని పోతూనే ఉంది. ఈ నేప‌ధ్యంలో మొన్న 20 వ తేది సుమారు 3700 ఎక‌రాల‌ను స్వాదీనం చేసుకోవ‌టానికి 26 మంది స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటి క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌భుత్వం నియ‌మిస్తూ, భూ సేక‌ర‌ణ నోటిఫికేష‌న్ జారీ చేసింది. 


భూ స‌మీక‌ర‌ణ ప్ర‌క్రియ లో క్రియాశీలకంగా ఉన్న మంత్రులు నారాయ‌ణ, ప్ర‌త్తిపాటి పుల్లారావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోతే ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిట‌ని మంత్రుల‌ను నిల‌దీశారు. చ‌ట్ట‌బ‌ద్ద‌మైన ప్ర‌క్రియ ను అనుస‌రిస్తే భ‌విష్య‌త్తులో రైతులు ప‌డే ఇబ్బందుల గురించి కూడా ప్ర‌స్తావించారు. అంటే ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భుత్వం అనుస‌రించింది చ‌ట్ట విరుద్ధ‌మైన ప్ర‌క్రియేన‌ని ప‌వ‌న్ అంగీక‌రించారు.మ‌రి అదే ప్ర‌క్రియ ద్వారా మిగిలిన రైతుల భూములు కూడా తీసుకోమ‌ని ప్ర‌భుత్వానికి సూచించ‌ట‌మేమిటో ఎవ‌రికీ ఆర్ధం కావ‌డం లేదు. పైగా భూ స‌మీక‌ర‌ణ వ్య‌వ‌హారంలో నిమ‌గ్న‌మైన మంత్రుల‌ను విమ‌ర్శిస్తున్న ప‌వ‌న్ స‌ద‌రు బాధ్య‌త‌ల‌ను వారికి క‌ట్ట‌బెట్టిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును మాత్రం మాట  మాత్రంగానైనా ప్ర‌శ్నించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. అయితే ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ త‌రువాత మిశ్ర‌మ స్పంద‌న క‌న‌బడుతోంది. ఇటీవ‌లే, ప‌వ‌న్ పార్ల‌మెంట్ స‌భ్యులు ప‌నితీరుపై విమ‌ర్శించిన‌ప్పుడు పార్టీలోని ఎంపీల‌లో అత్య‌ధికులు ఒక్క తాటిపైకి వ‌చ్చి ప‌వ‌న్ పై ఎదురుదాడి చేసారు. రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

 మెజారిటి ఎంపీలు ప‌వ‌న్ పై ఎదురుదాడి


ఎందుకుంటే.. మెజారిటి ఎంపీలు ప‌వ‌న్ పై ఎదురుదాడికి దిగ‌టంతో అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, మంత్రులు చిన్న‌రాజ‌ప్ప‌, గంటా శ్రీనివాస్ లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు. పార్టీలో ప‌వ‌న్ విష‌య‌మై విభేదాలు బ‌య‌ట ప‌డ‌తాయ‌న్న ఉద్దేశంతో వెంట‌నే చంద్ర‌బాబు రంగంలోకి దిగి అంద‌రినీ నియంత్రించారు. మ‌ళ్లీ అదే ప‌రిస్థితి ఇప్పుడు క‌న‌బ‌డుతుంది. రావెల కిషోర్ బాబు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డగా.. ప‌ల్లె, బొజ్జ‌ల‌, కామినేని లాంటి మంత్రులు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీంతో మంత్రివ‌ర్గంలో కూడా విభేదాలు ఎక్క‌డ మొద‌లౌతుందోన‌ని ఆలోచ‌న‌తో ఎవ‌రినీ బ‌హిరంగంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు అంద‌రికీ హెచ్చ‌రిక‌లు పంపిన‌ట్టు స‌మాచారం. మిత్ర ప‌క్ష‌మైనంత మాత్రాన బానిస‌గా ప‌డి ఉండ‌లేను అని ప‌వ‌న్ ఘాటుగా స్పందించ‌డంతో ఎంపీలను మంత్రులను ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నాల‌ను చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.


మిత్ర ప‌క్షం కాబ‌ట్టి విమ‌ర్శ‌ల‌ను కూడా పాజిటివ్ గా తీసుకుంగామ‌ని ఓ వైపు టీడీపీ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ..మ‌రో ప‌క్క ప‌వ‌న్ ఎటాక్ పై నేత‌లు లోలోప‌ల ర‌గిలిపోతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎంపీ ముర‌ళీ మోహాన్ రాజ‌మండ్రిలో స్పందించారు. హైద‌రాబాద్ రింగ్ రోడ్డు వ‌ద్ద త‌న సంస్థ కు చెందిన భూములుపై ప‌వ‌న్ అవ‌గాహ‌న లేకుండా మాట్లాడార‌ని త‌ప్పుప‌ట్టారు. అప్ప‌ట్లో లే ఔట్ మార్చినా కూడా వైఎస్ ప్ర‌భుత్వం 18 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంద‌ని, ఆ స‌మ‌యంలో మంత్రిగా ఉన్న వ‌ట్టి వసంత్ కుమార్ చేసిన వ్యాఖ్యల‌పై తాను సుప్రీం కోర్టుకు వెళ్ళాన‌ని ముర‌ళీ మోహన్ విర‌వ‌ణ ఇచ్చుకున్నారు. మ‌రోవైపు మంత్రి రావేల కిశోర్ బాబు కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ అభివృద్ధికి స‌హ‌కించాల‌ని, మిత్ర ప‌క్షంగా విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని కోరారు. భూ సేక‌ర‌ణ పై ప‌వ‌న్ అమ‌ర్యాద‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం బాధించింద‌ని మంత్రి రావెల అన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరు టీడీపీ ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌


భూ సేక‌ర‌ణ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరు టీడీపీ ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ను చంద్ర‌బాబు మ‌చ్చిక చేసుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కొంత మంది న‌మ్మ‌క‌స్తుల‌ను ప‌వ‌న్ వ‌ద్ద‌కు పంపించి భూ సేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించే విధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. ఒక్కవైపు ..ఢిల్లీ నుంచి కొంత‌మేర‌కు ఒత్తిడి తెస్తూ.. మ‌రోవైపు చంద్రబాబు త‌న మార్కు రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో భూ సేక‌ర‌ణ పై ప‌వ‌న్ ను మ‌చ్చిక చేసుకోవాల‌నుకుంటున్న టీడీపీ పార్టీ, ఎలాంటి మార్పుల‌ను వెతుకునుందో చూడాలి మ‌రి..!

మరింత సమాచారం తెలుసుకోండి: