ఆంధ్రా అసెంబ్లీ మొత్తం జరిగేదే ఐదు రోజులు.. కీలకమైన ఈ ఐదు రోజుల్లో ఒక రోజు వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత ఒక రోజు అసెంబ్లీలో లేరు. ఆ రోజు పట్టిసీమ ఇష్యూలో వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలని టీడీపీ నిలదీసి ఆ పార్టీని ఇరుకున పెట్టింది. మొదటి, రెండు రోజులు జగన్ ప్రత్యేక హోదాపై సర్కారును నిలదీసి కాస్తోకూస్తో సంపాదించిన క్రెడిట్ కాస్తా ఆరోజుతో కొట్టుకుపోయింది. అప్పటివరకూ వైసీపీ కాస్తో కూస్తో అప్పర్ హ్యాండ్ గా ఉన్నా.. ఆరోజుతో మళ్లీ అధికార పక్షానిదే పై చేయి అయ్యింది. 

ఇక మిగిలిన రెండు రోజుల్లోనూ టీడీపీదే పైచేయి కావాలన్న టీడీపీ వ్యూహాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అమలు చేసినట్టు కనిపిస్తోంది. కావాలనే పరుష పదజాలంతో వైసీపీని కవ్వించి సభను పక్కుదోవ పట్టించాలని టీడీపీ ముందుగానే ప్లాన్ చేసుకుందేమో అనిపిస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు  ఈ సమావేశాల తొలి నుంచే దూకుడుగా ఉన్నారు. మూర్ఖుడు అంటూ జగన్ ను నిందించి స్పీకర్ తో మొట్టికాయలు వేయించుకున్నారు. 

ఐతే.. నాలుగో రోజు అదే ఇష్యూపై మాట్లాడుతూ.. మరోసారి జగన్ పార్టీని సైకో పార్టీ అని కావాలనే అనడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఐతే.. వైసీపీ సభ్యులు ఎర్రన్నాయుడు ట్రాప్ లో పడిపోయి.. విలువైన అసెంబ్లీ కాలాన్ని వృథా చేసేశారు. విపక్షంపై అంత దురుసుగా మాట్లాడిన తర్వాత కూడా అధికారపక్షం నుంచి దానిపై ఎలాంటి సంజాయిషీ కనిపించకపోవడం విశేషం. ఎర్రన్నాయుడు సైకో పార్టీ వ్యాఖ్యల కలకలం సభ వాయిదాకు దారి తీసింది. 

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అచ్చెన్నాయుడు వాఖ్యలపై స్పందిస్తూ జగన్ కూడా రౌడీ ముఖ్యమంత్రి,  రౌడీ సభ్యులను అని విమర్శించడంతో అచ్చెన్నాయుడు విసిరిన వలలో జగన్ పడిపోయారేమో అనిపించింది. టీడీపీ ఎన్నిమాటలన్నా సంయమనం పాటిస్తామని అంటూ జగన్ రౌడీ ముఖ్యమంత్రి అనేశారు. ఈ సమయం కోసం వేచి చూస్తున్న కాల్వ శ్రీనివాసులు జగన్ నేర చరిత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ధూషణలతో సభా సమయం వృథా అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: