అప్పుడప్పుడు కొన్ని వార్తలు చదివితే ఒక్కసారిగా షాకవుతాం.. మనం చదువుతున్నది ఏ పేపరా అని ఓసారి చెక్ చేసుకుంటాం.. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాం.. మనం ఎంతగా చూసుకున్నా.. ఒక్కోసారి ఇది నిజమేనే అనిపించే వార్తలు వస్తుంటాయంతే. అలాంటిదే ఈ స్టోరీ కూడా.. చంద్రబాబు తోక పత్రిక అని గిట్టని వాళ్లు విమర్శించే ఆంధ్రజ్యోతిలో అలాంటి స్టోరీయే ఒకటి కలకలం సృష్టించింది. 

ఇంతకీ ఈ స్టోరీ ఏంటంటే.. ఆంధ్రా సీఎం  చంద్రబాబు గతంలోలా సామాన్యులను దగ్గరకు రానివ్వడం లేదని.. కనీసం కార్యకర్తలకు కూడా దర్శనభాగ్యం కల్గించడం లేదని ఏబీఎన్ రాధాకృష్ణ కనిపెట్టేశారు. ఊరికే ఏదో నాలుగు ముక్కలు కాకుండా కాస్త ఘాటుగానే బాబు తీరుపై ఏకిపారేశారు. 14 నెలలపాటు హైదరాబాద్‌ నుంచి పాలన సాగించి ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న చంద్రబాబు తనను కలిసేవారితో మాట్లాడేందుకు ఒక స్పష్టమైన విధానం రూపొందించలేక పోయారని విమర్శించారు. 

గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు సచివాలయం నుంచి ఇంటికి వెళ్తూ క్రమం తప్పకుండా టీడీపీ కార్యాలయానికి వచ్చేవారని.. ఇప్పుడు మాత్రం ఎవరికీ అందకుండా పోతున్నారని ఏబీఎన్ వాపోయింది. అటు ఆయన ఆఫీసులోనూ.. ఇటు ఇంటి దగ్గరా.. పార్టీ ఆఫీసులోనూ.. బాబును కలిసే అవకాశమే సామాన్యులకు ఉండటం లేదన్నది ఆ వార్తా కథనం. 

సేమ్ సీన్.. చంద్రబాబు విజయవాడకు మారిన తర్వాత కూడా కొనసాగుతోందట. చాలా ఇబ్బందుల్లో ఉన్నవారే.. ఏ రకంగానూ పని కాక.. చివరి ప్రయత్నంగా ముఖ్యమంత్రిని కలుసుకోవాలని అనుకుంటారని.. అలాంటివారికి చంద్రబాబు అవకాశం కల్పించడం లేదని ఆంధ్రజ్యోతి రాసింది. సీఎం సహాయ నిధి నుంచి సాయం కోసం వచ్చేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారట. పాత కష్టాలకు తోడు ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది సీఎంను కలవాలనుకునేవారికి. 

అదేంటంటే.. గతంలో సీఎంను కలవాలంటే హైదరాబాద్ వస్తే సరిపోయేది.. ఇప్పుడు ఆయన విజయవాడలో 5 రోజులు, హైదరాబాద్ లో 2రోజులు ఉంటున్నారు. ఏరోజు ఎక్కడ ఉంటారో క్లారిటీగా చెప్పలేం. మరి విజయవాడ వెళ్లాలా.. హైదరాబాద్ వెళ్లాలా.. ఒకవేళ అక్కడికి వెళ్లే.. ఆయన ఇక్కడుంటే.. ఒకవేళ ఇక్కడికి వెళ్తే.. ఆయన అక్కడుంటే.. ఆయన వచ్చేవరకూ ఎదురుచూడాల్సిందేనా..? ఆంధ్రా సీఎం చిక్కడు.. దొరకడు తరహా వ్యవహారాన్ని బాగా కడిగిపారేసిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి.. సీఎం కార్యాలయంలో వినతులు పరిశీలించేందుకు ఓ అధికారిని ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చింది. మరి రాధాకృష్ణ సలహా చంద్రబాబు పాటిస్తారా..?



మరింత సమాచారం తెలుసుకోండి: