ఆన మాట ఏదో ఆశతో వచ్చినది కాదు.. ఆగ్రహంలోంచి వచ్చినది మాత్రమే. ఎందుకంటే.. ఓ చిన్నారి పాప కేవలం అధికార్ల నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ సరిగా లేని మురుగు కాల్వల పాలబడి.. కొన్ని రోజుల తర్వాత.. సముద్రంలో శవంగా కొట్టుకురావడం అంటే.. అలాంటి విషాదాంత సంఘటన మానవత్వం ఉన్న ఎవ్వరిలోనైనా సరే ఆగ్రహాన్నే రగిలిస్తుంది. అందుకే.. విశాఖ పట్నానికి చెందిన భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు కూడా.. నగరంలో మురుగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను సజావుగా నిర్వహించడంలో విఫలం అవుతున్న నగరాభివృద్ధి అధికారుల చేతకాని తనాన్ని దెప్పిపొడుస్తూ.. ఒక్క ఆరునెలలు అధికారం పగ్గాలు నా చేతిలో పెట్టి చూడండి.. నగరం మొత్తం డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేస్తే అంటూ సవాలు విసరడం ఇక్కడ గమనార్హం. 


విశాఖలో ఇంటినుంచి ట్యూషన్‌కని బయల్దేరిని చిన్నారి అదితి కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంటినుంచి బయటకు రావడంతోటే.. మురుగుకాల్వలో పడి కొట్టుకుపోయి ఉండవచ్చుననే అనుమానంతోనే పాపకోసం చాలా వరకు వెతికే ప్రయత్నం చేశారు. ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో.. ఎవరైనా పాపను తీసుకెళ్లి ఉంటారా? అనే దిశగా కొన్ని అనుమానాలు దర్యాప్తులు సాగాయి. ఏది ఏమైనప్పటకీ చిన్నారి అదితి ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటే చాలునంటూ.. అందరూ కోరుకున్నారు. 


కాని విధి వక్రించింది. విశాఖలో కొట్టుకుపోయిన అదితి మృతదేహం కొన్ని రోజుల తర్వాత శుక్రవారం నాడు విజయనగరంలో సముద్రంలోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో అదితి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. విశాఖ నగర అధికారులు డ్రైనేజీల నిర్వహణపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే.. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆవేశంగా స్పందిస్తూ.. ఆరునెలలు నా చేతిలో నగరపాలన అధికారం పెట్టండి మొత్తం సెట్‌ చేసేస్తా అంటున్నారు. 


అయినా.. చంద్రబాబునాయుడు.. విశాఖపట్టణాన్ని మరో హైదరాబాదు రేంజికి తీర్చిదిద్దేస్తా అంటూ ఉంటారు. అక్కడ కనీసం సాధారణ ప్రజల సాధారణ జీవనానికి కూడా భద్రత లేకుండపోయే పరిస్థితుల్ని చక్కదిద్దకపోతే ఎలాగ అని జనం ప్రశ్నిస్తున్నారు. అద్భుత నగరాలను సృష్టించడం అనేది తర్వాతి సంగతి.. ముందుగా.. ప్రాణాలు హరించకుండా ఉండే నగరజీవనాన్ని అందివ్వాలని కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: