ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతున్న తరుణంలో పార్టీ పుంజుకుంటోందని తిరిగి అధికారంలోకి వస్తుందని ఏఐసిసి  ప్రధాన కార్యదర్శి తిరునావుక్కరసు పేర్కొనడంపై సర్వత్రా వెటకారాలు వెల్లువెత్తుతున్నాయి.  ఏపీలో ఉన్న జనాగ్రహాన్ని ఆయన ఏ ప్రాతిపదికన కొలిచారో గానీ..  లోకల్ లీడర్స్ కు లేని విశ్వాసం వెలిబుచ్చుతున్నారు.  రాష్ట్ర విభజన సమయంలో అగ్రశ్రేణి నాయకులు వ్యవహరించిన తీరు మరియు కేంద్ర నాయకుల వద్ద వారికున్న విలువలపై నమ్మకం దిగజారి పోయి దిగువ స్థాయి  కార్యకర్తలు కూడా కరువై పోయిన ఈ తరుణంలో కనీసం ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకత్వం ఆ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు.  ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో ఒక కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయమని 15 రోజుల పాటు సమావేశాలను అడ్డుకొన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా నోరు మెదపకపోవడంపై ఏ స్థాయి కార్యవర్గానికి కూడా మింగుడుపడడం లేదు. 

పార్టీలో ఏ నియోజక వర్గంలోనూ, ఏ ఒక్కరూ అందుబాటులో లేకపోయినా సమ సమాజ స్థాపన పార్టీ ధ్యేయమని చెప్పుకొంటున్న రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా    విషయంలో కేంద్ర స్థాయి నాయకత్వంతో ఒక్క మాట కూడా అనిపించలేకపోవడం మరియు ఢిల్లీ నాయకుల వద్ద వారి హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానం కాపాడలేనివారు సమ సమాజం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.  ఇటువంటి నాయకులు పక్కనే వున్న తమిళనాడు నాయకులు తమ రాష్ట్రానికి  అవసరమైన వాటిని కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా ఎలా సాధించుకొంటున్నారో చూసి నేర్చుకోవలసింది ఎంతైనా వుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి తన సొంతకాళ్ల మీద తాను లేచి నిలబడగలదని.. కనీసం ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులకు కూడా నమ్మకం ఉండడం లేదు. ఏజిల్లాలో చూసినా.. కాంగ్రెస్ సీనియర్లంతా అవకాశం వస్తే మరే యితర పార్టీలోకి వెళ్లిపోదామా అని కాసుకుని చూస్తున్నారు. గతిలేని వారు మాత్రమే కాంగ్రెస్ లో మిగిలినట్లుగా వాతావరణం ఉంది. కనీసం వచ్చే ఎన్నికల నాటికి.. తమ పార్టీ బతికే ఉన్నదని నిరూపించుకునేలా సింగిల్ డిజిట్ సీట్లయినా సాధించుకుంటే చాలని.. రఘువీరా లాంటి నేతలు నానా పాట్లు పడుతూ.. ఉంటే.. అతిథిలాగా ఢిల్లీ పరిశీలకుడిగా రాష్ట్ర వ్యవహారాలు చూడడానికి వచ్చే తిరునావుక్కరుసు.. ఏకంగా.. వచ్చే ఎన్నికలకు ఇక్కడ అధికారంలోకి వచ్చేస్తాం.. అంటూ డాంబికంగా ప్రకటించడం.. జనానికి నవ్వు తెప్పిస్తోంది. అందుకే.. ఇక్కడ అసలు వాళ్లకి నమ్మకం లేదుగానీ.. అతిథులకు తెగ నమ్మకం ఉన్నట్టుంది అని వారు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: