’’పదిమంది చల్లగా ఉండడం కోసం.. ఒకరిని చంపడానికైనా, చావడానికైనా సిద్ధమే‘‘ అనేది ఎంత పాప్యులర్ సింహాద్రి డైలాగో అందరికీ తెలుసు.  ఆ డైలాగు అప్పట్లో నందమూరి ఫ్యాన్స్ ను ఒక ఊపు ఊపేసింది. ఇప్పడు ఓ సాములోరు కూడా అప్పటి సింహాద్రి డైలాగును వల్లె వేస్తున్నారు. కాకపోతే.. ఆయన గోవధకు దానికి లింకు పెడుతున్నారు. గోమాత ను రక్షించుకోడానికి అంత పనీచేసేస్తా అంటున్నారు. మన దేశంలో ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే సన్నాసి కైనా సరే మాట దూకుడుతనం లక్షణంగా మారింది. సోషల్ మీడియాలో మీసాలు రాని కుర్రాళ్లు వాడుతున్న భాష ఎంత అసహ్యకరంగా ఉంటోందో మనందరికీ తెలుసు. ఇప్పుడు సన్యాసులు, మంత్రులు, ఎంపీలు కూడా అలాంటి భాష వాడకపోతే పొద్దుగడవని స్థితికి వచ్చేశారనిపిస్తోంది. సాక్షి మహారాజ్ అనే పెద్దమనిషి దీనికి అక్షర సాక్షి.

 

ఆవు మాంసం దాచి ఉంచుకుని తింటున్నారనే పుకారుతో ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటన దేశాన్ని కలవరపెడుతోంది. ఆ వ్యక్తిని అన్యాయంగా కొట్టి చంపారని ఇప్పుడు నివేదికలూ వస్తున్నాయి. ఏం చేయాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కాని ఇంతటితో దీన్ని వదిలిపెట్టమని, ఆవు జోలికి వెళ్లిన ఎవరినయినా సరే చంపుతామని ఎంపీగా మారిన కాషాయధారి నిర్భయంగా ప్రకటిస్తున్నాడు.

తాము పూజించే ఆవును కాపాడకునేందుకు తాము ఎవరినైనా చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ప్రకటించారు. గోమాతను ఎవరైనా చంపాలని చూస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌‌లో ఆ ఘటనలో మరణించిన వ్యక్తికి ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించడమేమిటని తప్పుబట్టారు కూడా. సాధువులకూ చంపుడు, చావుడు భాష అలవాటైపోతుంటే ఇక దేశమే గతి బాగుపడునో..


మరింత సమాచారం తెలుసుకోండి: