జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారించటాన్ని సవాలు చేస్తూ మళ్ళీ రాష్ట్రప్రభుత్వం తాజాగా మళ్ళీ పిటీషన్ వేసింది. రెండు రోజుల క్రితమే ఇటువంటి పిటీషన్ వేసిన రాష్ట్రప్రభుత్వం హౌస్ మోషన్ లో టేకప్ చేయాలని కోరింది. అయితే ప్రభుత్వ వాదనను తిరస్కరించిన కోర్టు పిటీషన్ ను కొట్టేసింది. ఎలాగైనా సరే ఎన్ఐఏ విచారణను అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. అసలు జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏతో విచారించాలని ఆదేశాలిచ్చిందే హై కోర్టు. అప్పుడు కూడా కోర్టును ఆదేశాలివ్వకుండా వీలైనంతగా రాష్ట్రప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ కోర్టు ముందు చంద్రబాబు పప్పులుడకలేదు.

 

అందుకే రాష్ట్రప్రభుత్వ వాదనను కోర్టు కొట్టేస్తూ ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. నిజానికి కోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత విచారణకు సహకరించుంటే కాస్త గౌరవమన్నా దక్కేది ప్రభుత్వానికి. కానీ తమకు ఇష్టం లేకపోయినా కోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశించటంతో విచారణలో అడ్డంకులు సృష్టించటం మొదలుపెట్టింది. అప్పటి వరకూ కేసును విచారించిన సిట్ అదికారులను కలసి సంబంధించిన ఫైళ్ళు ఇవ్వమని ఎన్ఐఏ అడిగితే కుదరదు పొమ్మన్నారు స్ధానిక పోలీసులు. రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు రాకపోతే తాము ఎటువంటి వివరాలు ఇవ్వలేమని చెప్పటం దారుణమే. అంటే స్ధానిక పోలీసులు కోర్టు ఆదేశాలనే ధిక్కరించినట్లైంది.

 

పోలీసుల సహాయ నిరాకరణ వెనుక ప్రభుత్వ పెద్దల ఆదేశాలున్నాయన్నది స్పష్టంగా అర్ధమైపోతోంది. స్వయంగా హై కోర్టే ఆదేశించినా ఎన్ఐఏ విచారణకు సహకరించటం లేదంటే కారణం ఏమై ఉంటుందో ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు. హత్యాయత్నం ఘటన వెనుకున్న సూత్రదారుల పాత్ర బయటపడుతుందన్న ఏకైక ఆందోళనతోనే ప్రభుత్వం ఎన్ఐఏ విచారణను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోందన్నది అందరికీ అర్ధమైపోతోంది. హత్యాయత్నం ఘటనలో టిడిపి కీలక నేతల హస్తం లేకపోతే ఎన్ఐఏ విచారణను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది ?


మరింత సమాచారం తెలుసుకోండి: