పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుండి టీడీపీ నేత పులపర్తి రామాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ పై 13,676 ఓట్లతో గెలుపొంది అసెంబ్లీ లో అడుగుపెట్టారు. మరోసారి విజయం సాధించాలని రామాంజనేయులు ధీమాగా ఉండగా...ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న గ్రంధి శ్రీనివాస్ నియోజకవర్గం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠ మారబోతోంది.

భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో అత్యధికంగా కాంగ్రెస్ 7 సార్లు విజయం సాధించింది. అలాగే టీడీపీ 5 సార్లు ఇక్కడ విజయం సాధించింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు రెండుసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ కి చెందిన నాచి వెంకటరామయ్య తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉండగా  టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ కూడా మెరుగైన ఫలితాలు సాధించింది. 2004, 2009 లో ఇక్కడ ఓటమి చవిచూసిన టీడీపీ ఆ తరవాత గత ఎన్నికల్లో విజయం సాధించింది.

2009 లో కాంగ్రెస్ పార్టీ తరుపున మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు పులపర్తి రామాంజనేయులు. గత ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గ్రంధి శ్రీనివాస్ ఈసారి గెలుపుకై వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడ పాగా వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇక్కడి నుంచి పెనమత్స వెంకట నరసింహరాజు అత్యధిక సార్లు విజయం సాధించారు. 2004 లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన పోటీకి దూరం అయ్యారు.

గత ఎన్నికలలో పులపర్తి కాంగ్రెస్ ను వీడి టీడీపీ లో చేరి టికెట్ సాధించగా గ్రంధి శ్రీనివాస్ వైసీపీ నుండి బరిలో దిగారు. ఇద్దరి మధ్యా విజయం పులపర్తి ని వరించింది. ఈసారి కూడా వీరిద్దరే పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు ను ఖరారు చేయగ ఇటు వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్ ను బరిలో నిలిచారు. ఇక ఇక్కడ పవన్ సామాజిక వర్గం బలంగా ఉండడంతో జనసేన కూడా గెలుపు పై ఆశలు పెట్టుకుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ,ఎమ్మెల్యే ల మధ్య పోటీ హోరాహోరీగా జరగనుంది. ఈ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: