ఏపీలో ఎన్నికలు జోరందుకున్నాయి. నామినేషన్ల ఘట్టం అయిపోతోంది. ప్రచారంలో అధినేతలు పరుగులు తీస్తున్నారు. ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి వేసవి వేడిని ఒక్కసారిగా పెంచేస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ, విపక్షంలో ఉన్న వైసీపీ, కొత్త పార్టీ జనసేన మూడూ కదన రంగంలో బస్తీమే సవాల్ అంటున్నాయి.


ఇదిలా ఉండగా ఏపీలో ఏ పార్టీది విజయం అంటే ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే జనం నాడిని పట్టే అనేక సాధనాలు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చేశాయి. దాని ఆధారంగా చూసినపుడు, అలాగే గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత ఎన్నికలు బేరీజు వేసుకున్నపుడు మొత్తం విశ్లేషణ చూస్తే మాత్రం ఏపీలో ప్రతిపక్షానికి ఓసారి  అవకాశం ఇవ్వాలని ఈసారి జనం అనుకుంటున్నారని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలు అయిన వైసీపీ ఈసారి రెట్టించిన హుషారుతో జనంలోకి వస్తోంది. అపుడున్న బంధాలు బీటలు వారగా టీడీపీ తీర్పు కోరుతోంది.


ఈ సీన్  చూసినపుడు వైసీపీకే ఎడ్జ్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. గతసారి పొత్తుల్లో ఉన్న పవన్ పార్టీ, బీజేపీ, మోడీ చరిస్మా అన్నీ వెనక్కు పోయాయి. ఆ మైనస్  ని లెక్క వేసి చూస్తే టీడీపీకి ఇపుడు ఎన్నికల్లో భారీ నష్టం ఉంటుందని అంటున్నారు. అంతే కాదు అయిదేళ్ళ పాలన తరువాత సహజంగానే వచ్చిన ప్రజా వ్యతిరేకత కూడా కొంత శాతం ఓట్లను మైనస్ చేస్తుందని, ఇవన్నీ బేరీజు వేసుకుంటే ఈసారి టీడీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.


అదే సమయంలో వైసీపీ నాటి బలాన్ని అలాగే పదిలం చేసుకుని అపుడు టీడీపీక్లి ఓటేసిన జిల్లాల కోటలను బద్దలు కొడుతోందని, అంటే వైసీపీకి అదనగా సీట్లు, ఓట్లు వచ్చే పరిస్థితి  ఉందని పొలిటికల్ పండిట్స్ అంచనా కడుతున్నారు. ఆ విధంగా సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను పక్కన పెట్టి మిగిలిన ఏడు జిల్లాలను తీసుకుంటే గత ఎన్నికల్లో కేవలం 24 సీట్లు మాత్రమే ఇక్కడ దక్కించుకున్న వైసీపీ ఈసారి ఆ సీట్లను డబులు చేసుకున్నా కూడా  తాను కోరుకుంటున్నట్లుగా అందలం ఎక్కడం ఖాయమని లెక్క వేస్తున్నారు. 


ఇక ప్రతి ఎన్నికలకూ ఓ ప్రభంజనం  ఉంటుంది.  గతసారి కూడా ఏపీలో ఒక్కసారిగా మోడీ వేవ్ వచ్చింది. ఈసారి రావాలి జగన్ అంటూ కనుక అలాంటి గాలి గట్టిగా వీస్తే మాత్రం 125 పై దాటి వైసీపీ సీట్లు సాధిస్తుందని.  టీడీపీపై  సాధారణ వ్యతిరేకత ఉన్నా కూడా సింపుల్ మెజారిటీతోనైనా  వైసీపీ గద్దెనెక్కడం ఖాయమని ఈ పొలిటికల్ పండిట్స్ అంచనాలు చెబుతున్నాయి. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: