ఎన్నిక‌ల‌కు స‌మ‌యం వ‌చ్చేసింది. నాయ‌కులు పోరుకు సిద్ధ‌మై పోయారు. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు గెలుపు గుర్రాలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. మ‌రో 18 రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ పోరు జ‌రిగిపోనుంది. ఈ క్ర‌మంలో నాయ‌కుల బ‌లాబ‌లాల‌పై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా కృష్ణాజిల్లాలోని పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికి చాలా భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎస్సీ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేసిన ఈ నియోజ‌క వ‌ర్గంలో పోటీ ప‌డుతున్న‌నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో పోరుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి వైసీపీ టికెట్‌పై గెలిచిన ఉప్పులేటి క‌ల్ప‌న ఇప్పుడు టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు. గ‌త ఎన్నిక‌ల‌లో ఆమెకు కేవ‌లం వెయ్యి ఓట్లు మెజారిటీ మాత్ర‌మే ల‌భించ‌డం గ‌మ‌నార్హం. 


ఇక‌, ఇప్పుడు వైసీపీ త‌ర‌ఫున కొత్త ముఖం ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం కానుంది. వైసీపీ త‌ర‌ఫున కే అనిల్‌కుమార్ ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక‌, కాంగ్రెస్ త‌ర‌ఫున గ‌తంలో పీఆర్‌పీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన మువ్వా మోహ‌న్‌రావు పోటీ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోరు ఈ ముగ్గురి మ‌ధ్యే ఉంటుంద‌ని అంటున్నారు. సాధార‌ణంగా రెండు ప్ర‌ధాన పార్టీలు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీగా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పోరు ఉంటే.. ఇక్క‌డ మాత్రం చాలా డిఫ‌రెంట్‌గా మూడు పార్టీల మ‌ధ్య పోరు హోరా హోరీ ఉంటుంద‌ని అంటున్నారు. ఇక‌, అభ్య‌ర్థుల విష‌యానికి వ‌స్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న‌పై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఆమె గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించి టీడీపీ లోకి జంప్ చేయ‌డాన్ని ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 


ఇటీవ‌ల ఆమె రెండు రోజుల కింద‌ట ప్ర‌చారం ప్రారంభించిన స‌మ‌యంలోనూ కొంద‌రు మ‌హిళ‌లు మా ఓటు దేనికి వేయ మంటారు? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక‌, అభివృద్ధి విష‌యంలోనూ క‌ల్ప‌న త‌డ‌బ‌డ్డారు. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క డే ఉన్నాయి. టీడీపీ కేడ‌ర్‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌ధానంగానియ‌జ‌క‌వ‌ర్గంపై టీడీపీ సీనియర్ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య పెత్త‌నం ఉండడం కూడా క‌ల్ప‌న‌కు ప్ర‌తిబంధకంగా మారింది. దీంతో ఆమె ప్ర‌చారం న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. ఇక‌, వైసీపీ అభ్య‌ర్థిగా కే అనిల్ కుమార్ పోటీ చేస్తున్నా.. గ‌త ఎన్నిక‌ల్లో ఉన్న ఊపు క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ రావాలి... ప్ర‌చారం ప్రారంభించాలి.. అనే విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 


ఆర్థికంగా కూడా వైసీపీ అభ్య‌ర్థి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఉన్న మువ్వా మోహ‌న్ రావు మాత్రం ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. త‌న‌కు పాత ప‌రిచ‌యాలు ఉండ‌డం, పార్టీల‌కు అతీతంగా అభిమానులు ఉండ‌డంతో ఇక్క‌డ బ‌ల‌మైన ఓటు బ్యాంకును చీలుస్తాడ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో పామ‌ర్రులో త్రిముఖ పోరు ఖాయ‌మ‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో గెలుపు ఓటములు కూడా దోబూచులాడ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: