మొన్నటివరకు ఒకే పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారడంతో గుంటూరు పార్లమెంట్‌ పోరు రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన గల్లా జయదేవ్ మరోసారి  తెదేపా నుండి బరిలోకి దిగుతుండగా…మొన్నటివరకు తెదేపాలో ఉన్న మోదుగుల వేణు గోపాల్‌రెడ్డి వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో గుంటూరులో ఇద్దరు అభ్యర్ధులు ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే ఇక్కడ జనసేన ఓ బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపింది కానీ...ప్రధాన పోటీ మాత్రం తెదేపా, వైకాపాల మధ్యే ఉండనుంది. గత ఎన్నికల్లో  గల్లా జయదేవ్ గుంటూరు నుండి బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలిచారు. అయితే గెలిచిన తొలి నాళ్లలో స్థానికంగా అందుబాటులో లేరన్న అపవాదు మూటగట్టుకున్న జయదేవ్‌.. క్రమేపీ అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చారు. 


ఇక స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జయదేవ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్లస్. ప్రత్యేక హోదా అంశంతో పాటు జిల్లాకు సంబంధించిన ఇతర అంశాలను పార్లమెంట్‌లో చర్చించి ఆయన తన ఇమేజ్‌ను అమాంతం పెంచుకున్నారు. ఇక ఆర్ధికంగా జయదేవ్ పరిస్తితి అందరికీ తెలుసు అలాగే సూపర్ స్టార్ మహేశ్ అభిమానుల మద్ధతు కూడా జయదేవ్‌కి పుష్కలంగానే ఉంది. కానీ స్థానికేతరుడు అనే ముద్ర ఆయన మీద ఇంకా ఉంది. నాయకులని పెద్దగా సమన్వయం చేసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వైకాపా నుంచి మోదుగుల పోటీ చేయడంతో జయదేవ్ విజయం అంత సులువు కాదనే అర్ధమవుతుంది. 2009లో నరసారావుపేట పార్లమెంట్, 2014లో గుంటూరు వెస్ట్ నుంచి మోదుగుల తెదేపా తరుపున పోటీ చేసి విజయం సాధించారు. 


అయితే చివరికి తెదేపాతో తెగతెంపులు చేసుకుని జగన్ చెంతకి చేరి...ఈ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోదుగులకి గుంటూరులో ఫుల్ క్రేజ్ ఉంది. కార్యకర్తలతో, ప్రజలతో మమేకం అవడం, పోల్ మేనేజ్‌మెంట్‌లో కూడా ధిట్ట కావడం మోదుగులకి ప్లస్. అయితే అయిదేళ్లుగా ఎమ్మెల్యేగా పెద్ద పనులు చేయలేదని ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇక ఇక్కడ తెదేపా చాలా బలంగా ఉంది. అటు పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం పోరాడిన తర్వాత  గల్లాకి క్రేజ్ ఎక్కువ ఉండటం మోదుగులకి మైనస్. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో గుంటూరు వెస్ట్, ఈస్ట్, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 


అయితే గత ఎన్నికల్లో మంగళగిరి, ఈస్ట్ నియోజకవర్గాలు తప్ప అన్నీ చోట్ల తెదేపా గెలిచింది. అయితే ఈసారి మంగళగిరి, పొన్నూరు, తెనాలి, వెస్ట్ నియోజకవర్గాల్లో తెదేపాకి కొంత ఎడ్జ్ ఉండగా..ఈస్ట్‌లో వైకాపాకి ఉంది. అటు తాడికొండ, ప్రత్తిపాడులో హోరాహోరీ ఫైట్ జరగనుంది. ఇక ఈ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో 15 లక్షల మంది ఓటర్లుంటే ఇందులో కమ్మ, కాపు, ముస్లింల ఓట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇంచుమించు 9 లక్షల మంది ఓటర్లు ఈ సామాజిక వర్గాల నుండే ఉన్నారు. అలాగే రెడ్డి వర్గం వారు లక్షకు పైగా ఉన్నారు. బీసీలు రెండు లక్షల మంది, ఎస్సీలు మరో రెండు లక్షల మంది వరకు ఉన్నారు. ఇతరులు మరో లక్ష మంది ఉన్నారు. మరి చూడాలి మళ్ళీ గల్లాను విజయం వరిస్తుందో.. లేక మోదుగులకు ప్రజలు పట్టం కడతారో..? 


మరింత సమాచారం తెలుసుకోండి: