ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత.. ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారశైలి చాలామందికి మింగుడుపడటంలేదు. ఈవీఎంల్లో అవకతవకలంటూ ఆయన చేస్తున్న పోరాటం చాలమందికి నవ్వు తెప్పిస్తోంది. దీనికితోడు రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఊదరగొట్టడం కూడా ప్రతిపక్షాలకు చెందిన నేతలు విమర్శించేందుకు కారణమవుతోంది. 


వైసీపీ నాయకులు చంద్రబాబు వైఖరిపై సెటైర్లు పేలుస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత సొంతంగా ఎక్కడో చోట ప్రమాణం చేసుకుని తానే సీఎంని అని చెప్పుకుని తిరిగేలా ఉన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాగా ఉండవలసిన సమయంలో ఇలా వ్యవహరించడం శోచనీయమన్నారు. 

చంద్రబాబు కారణంగా.. రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డు డేటా అంతా చోరీ అయిందని , ఆధార్ సంస్థ పిర్యాదు చేసిందని, ఇది సాధారణ నేరం కాదని, దేశ ద్రోహం కేసు అవుతుందని ఆయన విమర్శించారు. ఈ డేటా చోరీ కేసును పూర్తిగా విచారించాలని , ఈకేసు వెనుక ఉన్న రాజకీయ నేతలను కూడా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

టిడిపి వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా కేసు వేసి అప్రతిష్ట పాలు చేయడానికి యత్నించిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తో కలిసి చంద్రబాబు తిరగడం దారుణంగా ఉందని దాడి అన్నారు. ఈయన ఒక్కరే కాదు.. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా చంద్రబాబు తీరుపై సెటైర్లు వేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం దేశం కోసమే తన పోరాటమని స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: