క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారం ప్రకారం అదే జరగబోతోందట. చంద్రబాబునాయుడు ఏదో అనుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోపాయికారీగా ప్రోత్సహించారు. చంద్రబాబు ఉద్దేశ్యం పవన్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడమే. కానీ సీన్ రివర్సయి జనసేన వల్ల టిడిపికే దెబ్బ పడిందట. అందులోను ప్రధానంగా 12 పార్లమెంటు స్ధానాల్లో బాగా ఎక్కువగా తాకిందట దెబ్బ.

 

వివిధ పార్టీ నేతల సమాచారం ప్రకారం విశాఖపట్నం, అమాలపురం, రాజమండ్రి, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, హిందుపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నరసాపురం పార్లమెంటు స్ధానాల్లో టిడిపికి  కాపు దెబ్బ తప్పేట్లు లేదని సమాచారం. ఎందుకంటే పై స్ధానాల్లో ఎంపి అభ్యర్ధులుగా పవన్ గట్టి అభ్యర్ధులనే నిలబెట్టారు. వారంతా  వైసిపి ఓట్లను చీల్చుతారని ముందుగా అనుకున్నా ఓటింగ్ తర్వాత మాత్రం తమ అంచనాలు తారుమారైపోయినట్లు అర్ధమైపోయిందట.

 

పై నియోజకవర్గాల్లో అంటే విశాఖపట్నంలో జెడి లక్ష్మీనారాయణ, నరసాపురంలో సోదరుడు నాగుబాబు, నంద్యాలలో ఎస్పీవై రెడ్డి, రాజమండ్రిలో ఆకుల సత్యనారాయణ, హిందుపురంలో ఖాన్, చిత్తూరు నుండి పుణ్యమూర్తి, నెల్లూరు నుండి చండ్ర రాజగోపాల్ లాంటి గట్టి వారిని పోటీలోకి దింపారు.

 

నిజానికి పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే టిడిపి అభ్యర్ధులను గెలుపును త్యాగం చేయమని చంద్రబాబు చెప్పినా వాళ్ళు వినలేదట. అదే సందర్భంలో పై పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు గట్టిగా పోటీ ఇచ్చారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనసేన అభ్యర్ధులకు సొంతంగా గెలిచేంత సీన్ లేదని అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రత్యర్ధులైన టిడిపి, వైసిపిల అభ్యర్ధులను మాత్రం ఓడగొట్టడానికి పనికివస్తారు.

 

పై లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు కనీసం తలా లక్షో లేకపోతే లక్షన్నర ఓట్లో తెచ్చుకుంటే ఆ మందం టిడిపికే దెబ్బని ఇపుడు అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే, టిడిపి, జనసేనలు కలిసే పోటీ చేశాయి. అప్పుడు పవన్ ను చూసే కాపుల ఓట్లన్నీ టిడిపికి పడ్డాయి. ఇపుడు రెండు పార్టీలు విడిగా పోటీ చేశాయి కాబట్టి కాపుల ఓట్లలో మెజారిటీ ఓట్లు జనసేనకే పడతాయనటంలో సందేహం లేదు. కాబట్టి జనసేన దెబ్బ టిడిపి మీదే పడటం ఖాయమని అర్ధమవుతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: