ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేవ‌లం ఏడు స్థానాల్లో పోటీ చేసిన సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ ప్ర‌స్తుతం షెడ్యూల్ విడుద‌ల అయిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై గంపెడాశ‌లు పెట్టుకుంది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బొక్కాబోర్ల ప‌డ‌టం ఎందుకని ప‌రిమిత స్థానాల్లో బ‌రిలో దిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ రాబోయే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామ‌ని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు పార్టీ కార్యాల‌యంలో స‌మావేశం ఏర్పాటు చేసుకొని వెల్ల‌డించారు.


తెలంగాణ‌లోని 5857 ఎంపీటీసీ, 535 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారని వెల్ల‌డించారు.  


ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ మాట్లాడుతూ ``స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని జ‌న‌సేన‌ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో మనం ఏడు స్థానాల్లో పోటీ చేశాం. స్థానిక ఎన్నికల్లో పోటీ ఇందుకు భిన్నంగా ఉంటుంది. మన పార్టీకి యువత, మహిళలు బలం" అన్నారు. అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ "జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ ఏడు సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరం. వాటిని గ్రామ స్థాయి నుంచి అమలు చేసేందుకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి.

ఇందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షులు తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తాం" అన్నారని జనసేన పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కార్య‌క‌ర్త‌ల ఆకాంక్ష పేరుతో తెలంగాణ‌లో పోటీ చేయాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ప్ర‌య‌త్నం ఏ మేర‌కు స‌ఫ‌లీకృతం అవుతుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: