ఉగ్రవాదం ప్రపంచానికి పట్టిన ఒక పెద్ద పీడ..ఎదుటి వారు వందల సంఖ్యలో మరణిస్తే పైశాచిక ఆనందాన్ని పొందడం..ఆపై ఆ ఘనకార్యం తామే చేశామని నిస్సిగ్గుగా చెప్పడం ఈ మద్య ఉగ్రవాద సంస్థలకు కామన్ అయ్యింది.   తాము చేస్తున్న పని వల్ల ఎంతో మంది అమాయకులు దారుణంగా మరణించడం..అంగ వైకల్యంతో బాధపడటం..అనాధలుగా మారడం ఎన్నో జరుగుతున్నాయి.  ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఇలాంటి మారణ హోమాలను అరికట్టలేక పోతున్నాయి. 

నిన్న శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఉదయం ఆరు చోట్లలో పేలుళ్లు జరగడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.  మధ్యాహ్నానికి మరో రెండు పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు వెళ్లకుండా ఉండే పరిస్థితి నెలకొంది.  ఈ దాడులకు ఐసిస్ మాడ్యూల్ కారణమని నమ్ముతున్న శ్రీలంక సర్కారు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. కొలంబో నగరంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

పేలుళ్ల నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండ్రోజుల పాటు సెలవు ప్రకటించారు. కాగా, దాడులపై ముందస్తు సమాచారం ఉన్నా, మారణహోమం జరగడం ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమేనంటూ శ్రీలంక విపక్షాలు మండిపడుతున్నాయి.  మరణించిన వారి సంఖ్య 180కి చేరినట్టు సమాచారం. క్షతగాత్రుల సంఖ్య 450 వరకు ఉంది. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: