చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే మీడియా లెక్కల ప్రకారమే సొంత జిల్లా చిత్తూరులో కూడా టిడిపికి పరాభవం తప్పేట్లు లేదు.  కాకపోతే  చంద్రబాబు సేవలో నిరంతరం తరించే సదరు మీడియా ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా అడ్డదిడ్డమైన రీతిలో చదవే వాళ్ళకు అర్ధంకాని రీతిలో పెద్ద కథనాన్ని వండి వార్చింది.

 

మామూలుగా అయితే  పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్ధికి గెలుపు అవకాశాలు తక్కువనే చెబుతారు.  ఓడిపోతారని చెప్పలేకపోయినా పరోక్షంగా సున్నితంగా చెబుతారు. పలానా అభ్యర్ధి కచ్చితంగా గెలుస్తాడని తెలిసినా ముందు జాగ్రత్తగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పటం అందరికీ తెలిసిన విషయమే. పై రెండు పద్దతుల్లోను పరోక్షంగా చెప్పినా, ప్రత్యక్షంగా చెప్పినా విషయం అయితే చదివేవాళ్ళకు సూటిగా అర్ధమైపోతుంది.

 

కానీ సదరు మీడియా మాత్రం అడ్డదిడ్డంగా కథనం రాయటమే విచిత్రంగా ఉంది. పశ్చిమ మండలాల్లో టిడిపి అభ్యర్ధులకు ఆర్దిక వెనుకబాటని రాసింది. అంటే అర్ధమేంటి టిడిపి అభ్యర్ధులు ఆర్దిక అంశాల్లో వెనకబడ్డారని చెప్పటమే. అభ్యర్ధుల మార్పులో సర్దుబాటులో లోపాలట. అంటే ఏమిటి చివరి నిముషంలో అభ్యర్ధులను ఖరారు చేయటం లేదా కొత్తవారికి ఇవ్వటంతో పార్టీ శ్రేణులు పనిచేయలేదని చెప్పటమే.

 

పలమనేరులో చెమటోడ్చిన మంత్రి అని చెప్పారు. మంత్రిగా ఉండి, ఐదేళ్ళు బ్రహ్మాండమైన అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి కూడా చెమటోడ్చటమేంటి ?  అసలు పోటీనే కాదని అనుకున్న వైసిపి అభ్యర్ధి వెంకటేష్ గౌడ్ దెబ్బకు మంత్రికి చెమటలు పట్టాయంటే అర్ధమేంటి ? గెలుపు అనుమానమనే కదా ? పైగా మంత్రి స్ధానికతపైన కూడా వి కోట మండలంలో తీవ్ర చర్చ జరిగిందని సదరు మీడియానే చెప్పింది.

 

చంద్రగిరి, పుంగనూరులో టిడిపి అభ్యర్ధులు శక్తకి మించే పోరాడారట. తిరుపతిలో వైసిపి బాగా బలహీనంగా ఉందని చెప్పింది. కాకపోతే పోల్ మ్యానేజ్ మెంటులో బాగా మెరుగుపడిందని చెప్పింది. టిడిపి అభ్యర్ధి సుగుణమ్మ మీద మంచి అభిప్రాయమే ఉందని చెప్పటం శుద్ధ అబద్దం. ఎంఎల్ఏ అవినీతిలో కూరుకుపోయారని ఈమెకే టికెట్ ఇస్తే గెలవదని స్పష్టంగా చెప్పారు నేతలు. అయినా చంద్రబాబు లెక్కచేయకపోవటంతోనే మాజీ ఎంఎల్ఏ చదలవాడ కృష్ణమూర్తి టిడిపిని వదిలిపెట్టి జనసేన తరపున పోటీ చేసింది వాస్తవం. ఇక నగిరి విషయంలో కూడా ఓ పట్టాన అర్ధంకాకుండా రాసారు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే జిల్లాలో టిడిపి కచ్చితంగా గెలుస్తుందని చెప్పుకునేందుకు కుప్పం తప్ప రెండో నియోజకవర్గమే లేదని పార్టీ నేతలే మొత్తుకుంటున్నారు. చంద్రబాబుకు ఇచ్చిన రిపోర్టులో కూడా అదే చెప్పారట. పూతలపట్టు, పీలేరు, మదనపల్లిలో  ఓరెండుచోట్ల గెలిస్తే గెలవచ్చంటూ చెబుతున్నారంతే. అంటే టిడిపి లెక్కల ప్రకారమే పార్టీకి వచ్చేది మూడు సీట్లకన్నా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: