ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగా విద్యార్థులు నష్టపోయినందున రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫీజు రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.  మ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిన ఇంటర్ బోర్డు అధికారులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలతో మారుమోగుతున్న కార్యాలయం రణరంగాన్ని తలపిస్తుండటంతో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో ఇబ్బందులు పడుతున్నారు.  తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఎదుట కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుపట్టారు. 


తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి తీవ్ర అయోమయంలో పడడానికి సీఎం కేసీఆరే కారణమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తప్పిదాల వల్ల 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఏంచేస్తున్నారని రేవంత్ నిలదీశారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనలు చేపడుతుండగా, క్రమంగా రాజకీయ పక్షాలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి.  తెలంగాణ బోర్డు నిర్వాకంతో  వేల మంది విద్యార్థుల భవిష్యత్ ఆందోళనలో పడింది.


బాగా చదివే విద్యార్థులకు సున్నా మార్కులు వేసి వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రూ.1000 కట్టిన వాళ్లకు రీవాల్యూయేషన్ చేసి వాళ్ల పేపర్లు వాళ్లకు ఇవ్వడానికి ఏంటి మీకొచ్చిన సమస్య? ఇన్ని వేలమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్ష జరపడంలేదు?వాళ పేపర్ల వాల్యూయేషన్ లో అవకతవకల వల్లే ఇంతటి ఉపద్రవం వచ్చిపడింది. ఆ పన్నెండు మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. ఆయన మంత్రిగా వైఫల్యం చెందారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: