ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మ‌రోమారు బాంబు పేల్చారు. శ్రీ‌లంక‌లో జ‌రిగిన బీతావ‌హ దాడి గురించి త‌న‌దైన శైలిలో ఆయ స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల నుంచి మొద‌లుకొని ఢిల్లీ పీఠం, శ్రీ‌లంక‌లో బాంబు బ్లాస్టుల వ‌ర‌కు..కేఏ పాల్ త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


శ్రీలంక చాలా శాంతి దేశమ‌ని పేర్కొన్న పాల్ అలాంటి దేశంలో బాంబు పేలుళ్లు జరగడం దురదృష్టకరమ‌ని అన్నారు. ఆ పేలుళ్లను ఖండిస్తున్నాన‌ని తెలిపారు. ఇండియాలో మళ్లీ మోడీ ప్రధాని అయితే మన దేశంలో కూడా శాంతి ఉండదని కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తుందని, తాను ముందు నుంచి  ఈవిషయాన్నే చెబుతున్నానని తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలో నాయకులు అందరూ కలసి కష్టపడితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోగలం అన్నారు. “సేవ్ సెక్యులర్ ఇండియా“ నినాదంతో తాను ముందుకు వెళ్తున్నాన‌ని కేఏ పాల్ వెల్ల‌డించారు. ఇప్పుడిప్పుడే  అందరు నేత‌లు త‌నకు మద్దతు ఇస్తున్నారని, అయితే, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సహకరించకడం లేద‌న్నారు. ఆయ‌న స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం చాలా బాధాకరం అని పాల్ అన్నారు. ``నేను నాయకత్వం వహిస్తున్నాన‌ని... చంద్రబాబు ఇతర నాయకులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారు.. నాకు క్రెడిట్ వస్తుందని చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారు.``అని విమర్శించారు. జాతీయ మీడియా కూడా త‌నకు మద్దతు ఇస్తే కేంద్రంలో మోడీ రాకుండా చేయొచ్చున‌ని పాల్ వివ‌రించారు. 


కాగా, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై త‌న‌కెన్నో అనుమానాలు ఉన్నాయ‌ని పాల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో 80 శాతం ఈవీఎంలు ఒకేసారి ఎందుకు ఆగిపోయాయి.? అని కేఏ పాల్ ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాధానం రాలేదని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: