ఆర్థికంగా ఇప్ప‌టికే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఏపీ.. ఇప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసిందా?  క‌నీస ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బులు పూర్తిగా క‌రువ‌య్యాయా?  ప‌నిచేసి ప్ర‌భుత్వాన్ని న‌డిపించే వేత‌న జీవుల‌కు కూడా మొండి చేయి చూపించాల్సిన ప‌రిస్థితి దాపురించిందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లుతో రాష్ట్రంలో పాల‌న నిలిచిపోయిన ప‌రిస్థితి తెలిసిందే. పోనీ.. గ‌వ‌ర్న‌ర్ పాల‌న జ‌రుగుతోందా? ఆయ‌నేమైనా నిర్ణ‌యాలు తీసుకుని పాల‌న‌ను ముందుకు తీసుకు వెళ్ల‌గ‌ల‌రా? అంటే ఆ ప‌రిస్థితి కూడా లేదు. ప్ర‌తి విష‌యాన్నీ ఎన్నిక‌ల సంఘానికి చెప్పి చేయాల్సిందే. దీంతో రాష్ట్ర ప‌రిపాల‌న అంతా కూడా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నేతృత్వంలోనే సాగుతోంది. అయితే, గ‌డిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ ప్ర‌భుత్వం సేక‌రించిన నిధుల‌నే ఇప్పుడు ఖ‌ర్చు చేయాలి. 


కొత్త‌గా ప‌న్నులు వేసేందుకుకానీ, కొత్త‌గా ఆదాయం సృస్టించేందుకు కానీ ఎన్నిక‌ల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉండ‌వు. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు పాలించిన ప్ర‌భుత్వం ఖ‌జానాలో ఉంచిన క‌నీస నిల్వ‌ల‌తోనే ప్ర‌భుత్వ పాల‌న‌ను ఎన్నిక‌ల సంఘం కోడ్ అమల్లో ఉన్నంత వ‌ర‌కు కొన‌సాగించాలి. ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా క‌నీసం 3 మాసాల‌కు స‌రిపోయే విధంగా నిధుల‌ను రిజ‌ర్వ్ చేస్తుంది. ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించినా... ఎక్క‌డైనా ఎలాంటి ఆప‌ద‌లు వ‌చ్చినా.. ఈ నిధుల‌ను వినియోగించుకునే వెసులు బాటు రాష్ట్రానికి ఉంది. కానీ, ఏపీలో మాత్రం ఇది రివ‌ర్స్ అయింది. చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న‌లో ఆయ‌న చేసిన దుబారా వ్య‌యం కార‌ణంగా.. ఏపీ ఖ‌జానా ఇప్పుడు మ‌ట్టికొట్టుకు పోయింది. ఒక్క పైసా కూడా లేకుండా పోయి జీరో బ్యాలెన్స్ అయిపోయింద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. నిజానికి చంద్ర‌బాబు త‌న‌ను తాను విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా చెప్పుకొంటారు. 


మ‌రి ఆయ‌న విజ‌న్ ఏంటి?  రాష్ట్రానికి ఆయ‌న చేసిన మేలు ఏంటి? అంటే.. విభ‌జ‌న నాటికి ఉన్న అప్పుల‌ను మూడింత‌ల‌కు పెంచ‌డం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్ట‌డం, అంత‌కుమించి ఉన్న డ‌బ్బులు కూడా త‌న సొంత ప్ర‌చారానికి వినియోగించ‌డం, న‌చ్చిన వారికి, భ‌ట్రాజుల్లా త‌న‌ను పొగిడిన వారికి నిధుల పందేరం చేయ‌డం వంటి కార‌ణంగా ఖ‌జానాను ఖాళీ చేసేశారు. క‌నీసం మూడు మాసాల‌కు కాదు క‌దా.. ఒక్క నెల‌కు స‌రిపోయే నిధులు కూడా ఖ‌జానాలో లేకుండా పోయాయ‌ని అంటున్నారు అధికారులు. ఈ నెల(ఏప్రిల్‌) 1న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం ప్ర‌భుత్వ ధ‌ర్మం. అయితే, వీరిలో కాంట్రాక్టు ఉద్యోగుల‌కు ఇప్ప‌టికే రెండు మాసాలుగా జీతాలు ఇవ్వ‌లేదు. ఇక‌, రెగ్యుల‌ర్ వారికి కూడా మ‌మ అనిపించిన చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. 


ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో వ‌చ్చే నెల అంటే మే 1న జీతాల చెల్లింపు అంశం.. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల సంఘం నేతృత్వంలో ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చేతిలో ఉంది. మ‌రో వారంలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు ముందుగా జీతాలు విడుద‌ల చేయాలి. ఇప్ప‌టికే హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్‌ల నుంచి నివేదిక‌లు, జీతాల చె్ల్లింపుల‌కు సంబందించిన ద‌స్త్రాలు కూడా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కార్యాల‌యానికి చేరాయి. అయితే, అదేస‌మ‌యంలో ఆర్థిక శాఖ నుంచి కూడా నివేదిక‌లు సీఎస్ వ‌ద్ద‌కు వ‌చ్చాయి. ``సార్! ఈ నెల జీతాల‌కు డ‌బ్బులు లేవు`` అన్న‌ది వాటి సారాంశం. దీంతో సీఎస్ నిర్ఘాంత పోయారు. విష‌యాన్ని రెండు రోజుల కింద‌టే ఆయ‌న ఎన్నిక‌ల సంఘం దృస్టికి తీసుకు వెళ్లారు. అయితే, నెమ్మ‌దిగా ఈ విష‌యం ఇప్పుడు బ‌హిర్గ‌తం కావ‌డంతో ఉద్యోగ వ‌ర్గాల్లో ఆందోళ‌న మొద‌లైంది. మొత్తానికి చంద్ర‌బాబు దెబ్బ‌తో ఏపీ అభివృద్ధి దిశ‌గా కాకుండా అతఃపాతాళం దిశ‌గా అడుగులు వేస్తోంద‌నే ఆగ్ర‌జ్వాల‌లు పెల్లుబుకుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: