ఎన్నో ఆశలతో విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్ రాసి పై చదువులకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు పెద్ద షాక్ ఇచ్చింది.  ర్యాంకులు వస్తాయని భావించిన వారికి సింగిల్ డిజిట్ మెమోలో కనిపించడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.  తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డ్ చేసిన తప్పిదాలతో ఇంతవరకూ 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న నిరసనల సెగ నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ను తాకింది. నిన్నటివరకూ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలకు దిగిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు.


గత మూడు రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్న రగడపై కేసీఆర్ స్పందించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని ఆరా తీశారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, విద్యాశాఖ కార‍్యదర్శి జనార్దన్‌ రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డులో అవకతవకలపై సీఎం కేసీఆర్ వివరాలు తెలియజేయాలని ఆజ్ఞాపించినట్లు సమాచారం. 


ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్, గ్లోబరీనా సీఈవో రాజు, విద్యాశాఖ సెక్రటరీ జనార్ధన్‌రెడ్డిని ఐదు గంటల పాటు విచారించింది. ఫలితాల్లో తప్పిదాలకు కారకులు ఎవరు? ఎన్నడూలేని విధంగా భారీగా తప్పులు దొర్లడానికి కారణం ఏంటి? ఇందులో ఇంటర్ బోర్డు పాత్రేమిటి? అంటూ కమిటీ వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.   ఈ సమవేశంలో కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇవాళ సాయంత్రం తమ నివేదికను అందజేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: