ఇంట‌ర్మీడియట్ ఫ‌లితాల వివాదం క‌ల‌క‌లం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప్ర‌భుత్వం ప‌రువు బ‌జారు పాలు చేసిన ఈ ఉదంతంపై గులాబీ ద‌ళ‌ప‌తి క‌న్నెర్ర చేశారు. ఇందుకు బాధ్యుల‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పరీక్షల్లో పాసైన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే.. గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని చెప్పారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలన్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌తోపాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డికి సీఎం కేసీఆర్ అప్పగించారు.


మ‌రోవైపు ఇంటర్మీడియట్‌ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌‌‌‌కుమార్‌ ను సమస్యకు ప్రధాన బాధ్యుడిగా గుర్తిస్తూ ఆయన్ను ప్రధాన బాధ్యతలన్నింటి నుంచి తప్పించింది. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ తోపాటు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డికి అప్పగించింది. ఇదే అంశంపై సోమవారం హైకోర్టులో కేసు విచారణకు రానుంది. కోర్టుకూడా ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ కు ఆదేశాలు ఇచ్చే అవకాశముండటంతో దానికిముందే సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫలితాల అనంతర పరిస్థితిపై సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలి.. విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఏటా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం.. ఈ తలనొప్పుల నివారణ అసాధ్యమేమీ కాదన్నారు. 


కాగా, ఇంటర్మీడియట్ విద్యార్థుల డాటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఆరాతీశారు. ఈ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజెన్సీలను ఎంపికచేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మధించిందని తెలిపారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: