చంద్రబాబు .. మోడీకి వ్యతిరేకంగా దేశమంతా తిరుగుతున్నాడు. అందరిని ఒకటి చేస్తున్నాడు. కాంగ్రెస్ కోసం తెగ కష్టపడుతున్నాడు. అయితే మమతా బెనర్జీ అయినా, మాయవతి అయినా, సమాజ్ వాదీ పార్టీ అయినా.. రాహుల్ ను అతిగా భుజానికి ఎత్తుకోవడం లేదు. కాంగ్రెస్ తరఫున ప్రచారానికీ రావడంలేదు. వాళ్లకు కాంగ్రెస్ తో చాలా అవసరమే ఉంది. పరిస్థితుల దృష్ట్యా ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీలు ఎటు తిరిగీ కాంగ్రెస్ తోనే కలిసి ఉండాలి. అయినా అవి కాంగ్రెస్ ను దూరమే పెడుతున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పల్లకి మోతకు చాలా కష్టపడుతూ ఉన్నారు.


రాష్ట్రాలన్నీ తిరిగి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంతచేస్తున్నా కాంగ్రెస్ రేపు చంద్రబాబుకు తగినన్ని సీట్లు రాకుంటే దగ్గరకు తీసుకోదు! కాంగ్రెస్ కు కొద్దో గొప్పో అవకాశాలు వస్తే.. అప్పుడు జగన్ ను భుజానికి ఎత్తుకోవడానికి ఆ పార్టీ మొహమాటపడదు కూడా. ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లను ఎవరు నెగ్గితే వారినే కాంగ్రెస్ భుజానికి ఎత్తుకుంటుంది. జగన్ తమ వాడంటూ.. కాంగ్రెస్ వాళ్లు ఏ మొయిలీనో, ఆజాద్ నో పంపించగలదు! ఇక కాంగ్రెస్ కు అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.


బీజేపీనే మళ్లీ బిగ్గెస్ట్ పార్టీగా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరఫున మరీ ఎక్కువగా తాపత్రయ పడిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ చిత్తు అయినా, చంద్రబాబు నాయుడు ఏపీలో చిత్తు అయినా.. కేంద్రంలో అటు బీజేపీ అధికారానికి దగ్గరై.. అప్పుడు ఏ కేసీఆరో, జగనో ఆ కూటమికి దగ్గరైతే.. అప్పుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం ఏమీకాదు!

మరింత సమాచారం తెలుసుకోండి: