నవ్యాంధ్రకు తొలి సీఎంగా చంద్రబాబు పీఠం ఎక్కారు అంటే అందుకు ఆయన ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు ఆయ‌న ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఈ విషయాన్ని చంద్రబాబు సైతం అనేక సార్లు ఒప్పుకొన్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లతోనే టీడీపీ అధికారంలోకి రావటం... చంద్రబాబు నవ్యాంధ్ర తొలి సీఎం అవ్వడం జరిగాయి. 15 సీట్లు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో వైసిపికి గత ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. 19 సీట్లు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో వైసిపి కేవలం 5 సీట్లతో సరిపెట్టుకుంది. రెండు జిల్లాల్లో కలిపి ఐదు ఎంపీ సీట్లు ఉంటే ఐదు సీట్ల‌లోను వైసీపీ చిత్తుగా ఓడింది.  చంద్రబాబును సీఎం పీఠంపై కూర్చోబెట్టిన ఈ జిల్లా ప్రజలకు ఆయన ఐదేళ్లలో చుక్కలు చూపించారు. తాము బాబును సీఎం చేసినందుకు ఈ రెండు జిల్లాల రూపురేఖ‌లు మార్చేస్తాడ‌ని ఇక్క‌డ ప్ర‌జలు ఆశ‌లు పెట్టుకుంటే ఇక్క‌డ వాళ్ల‌కు బాబు అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి... అర‌చేతిలో చుక్కంత తేనె వేసి మోచేతి వ‌ర‌కు నాకించేశారు.


తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన జిల్లాలకు భారీ ప్రాజెక్టులు కట్టబెట్టి వాళ్లకు న్యాయం చేసిన చంద్రబాబు  ఈ రెండు జిల్లాలకు ఒరగ‌ పెట్టింది శూన్యం.  పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు ఎంతో కష్టపడిన‌ కార్యకర్తలను గెలిచాక టిడిపి ఎమ్మెల్యేలు విస్మరించారు. మట్టి, ఇసుక, జన్మభూమి కమిటీల పేరుతో దొరికిన కాడికి దొరికిన‌ట్టు అడ్డంగా దోచుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో  స్థానిక సంస్థలలోనూ టిడిపికి వన్ సైడ్‌గా ఓట్లేసి గెలిపించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌న్న ఆనందం స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, పార్టీలో వీరాభిమానుల‌కు, స‌గ‌టు కార్య‌క‌ర్త‌కు లేకుండా పోయింది. ఐదేళ్ల పాటు జిల్లాలో పైనుంచి కిందిదాకా ఆ పార్టీ నేతలే అధికారంలో ఉన్నారు. వీరు చేసిన అరాచకాలకు, దోపిడీకి విసిగిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి తోడు చంద్రబాబు  ఇక్కడ నుంచి పట్టిసీమ నీటిని తీసుకువెళ్లి కృష్ణా  డెల్టాకు మేలు చేశారే తప్ప గోదావరి డెల్టాకు ఆయన చేసిందేమీ లేదు. 


ఇక రెండు జిల్లాల్లో ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నా వారికోసం ఒక ప్రాజెక్టు ఈ జిల్లాలకు రాలేదు. ఇవన్నీ ఓటర్లను బాగా ఆలోచింపచేశాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో  ఈ సారి ఓటరు టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పినట్టు పోలింగ్ సర‌ళి చెబుతోంది. రేపు ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా సానుకూల ఫ‌లితాలు వ‌స్తుండంగా... టీడీపీకి చావు దెబ్బ త‌ప్పేలా లేదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఈ ఎన్నికల్లో టిడిపి కేవలం నాలుగు నుంచి ఐదు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఈ జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లలో ఒక ఎంపీ సీటు పై టిడిపి ఇప్పటికే ఆశలు వదులుకోగా... మరో ఎంపీ సీటుపై చిన్నపాటి ఆశ మాత్రం మిగిలి ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సారి వైసిపి, టిడిపి కంటే మెజార్టీ సీట్లను దక్కించుకోనుంది. ఈ జిల్లాలో జనసేన ఎఫెక్ట్‌తో టిడిపి విలవిల్లాడింది. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఈ సారి టీడీపీ సీనియ‌ర్ల‌కు సైతం షాక్ త‌ప్పేలా లేదు. ఏదేమైనా ఉభ‌య‌గోదావ‌రి జిల్లా ఓటరు ఇచ్చే తీర్పుతో రేపు ఫలితాల తర్వాత చంద్రబాబుకు అదిరిపోయే షాక్ తగలటం పక్కా.


మరింత సమాచారం తెలుసుకోండి: