ఏపీలో పోటా పోటీగా ఎన్నికలు జరిగాయి. ఈసారి తమాషా ఏంటి అంటే ఎక్కడా ఓటర్లు తమ మనసులోని మాటను బయటపెట్టలేదు. దాంతో తలపండిన వారు సైతం ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నారు. అయితే ఇప్పటికి వచ్చిన అన్ని సర్వే ఫలితాలు జగన్ సీఎం అంటున్నాయి. దాంతో పదేళ్ళ క్రితం వైఎస్సార్ జమానాలో ఓ వెలుగు వెలిగిన అధికార గణం కొత్త ఆలొచనలు చేస్తోంది


జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తారనే ప్ర‌చారంతో ఏపి కేడ‌ర్‌కు చెంది కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న ఐఏయ‌స్..ఐపీఎస్ అధికారులు ఏపీకి తిరిగి వచ్చేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. వారిలో అనేక మంది సీనియ‌ర్ అధికారులు ఉన్నారు.  తాజా  ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఏపీకీ పెట్టుబ‌డులు వ‌స్తాయా ..అధికారులు ఏవ‌రైనా ఏపీలో ప‌ని చేస్తారా అంటూ టీడీపీ ముఖ్య నేత‌లు ప్ర‌చారం చేసారు. కానీ, ఇప్పుడు అంచ‌నాలు మారుతున్నాయి. ఏపీ కేడ‌ర్ నుండి ఉద్యోగంలో చేరి..ఇక్క‌డ ప‌రిస్థితుల కార‌ణంగా కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన కొంద‌రు ఐఏయ‌స్‌..ఐపీఎస్ అధికారులు తిరిగి మాతృ రాష్ట్రంకు వ‌చ్చేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇందు కోసం ఏపీలోని త‌మ స‌హ‌చ‌ర అధికారుల‌తో మంత‌నాలు సాగిస్తున్నారు. 


ఈ మేరకు మ‌రి కొంద‌రు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌స్తే తాము ఏపీకీ తిరిగి వ‌స్తామ‌ని ధ‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో ఐఏయ‌స్‌తో పాటుగా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వారిలో ఏపీలో ఉన్న‌ప్పుడు సంచ‌ల‌న అధికారిగా పేరున్న ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ సీతారామాంజ‌నేయులు ఉన్నారు. ఆయన ప్ర‌స్తుతం ఆయ‌న డిప్యుటేష‌న్ పైన కేంద్ర స‌ర్వీసుల్లో బిఎస్ఎఫ్ అధికారిగా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న తిరిగి ఏపీకీ వ‌స్తే అద‌న‌పు డీజీ హోదా ద‌క్క‌నుంది. దీంతో..ఆయ‌న జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఆయ‌న ప్ర‌భుత్వంలో ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా ఉంటార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది. 


అదే విధంగా సీఆర్పీఎఫ్ ప్ర‌త్యేక డిజీగా ఉన్న విఎస్‌కె కౌముది, కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న మ‌నీశ్ కుమార్ సిన్హా, అంజ‌నా సిన్హా, ధ‌ర్మారెడ్డి వంటి వారు ఏపీకీ తిరిగి వ‌చ్చేందుకు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వారంతా జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే త‌మ‌కు ప్రాధాన్య‌త ద‌క్కుతుంద‌నే అంచ‌నాతో సొంత రాష్ట్రంకు తిరిగి రావాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.  ఇక‌, ఇప్పటికే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ర్సెస్ సీఎస్ వివాదం పైన అనేక మంది సీనియ‌ర్ అధికారులు చ‌ర్చించుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో..ఏపీలో ఫ‌లితాల త‌రువాత ప్ర‌భుత్వం మారితే ఏం చేయాల‌నే ఆలోచ‌న‌లో కొంద‌రు అధికారులు ఉన్నారు


వైయ‌స్సార్ హ‌యాంలో కీల‌క స్థానాల్లో ప‌ని చేసిన అధికారుల‌తో .. మ‌రి కొంద‌రు అధికారులు ఇదే అంశం పైన మంత‌నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తే త‌మకు ప్రాధాన్య‌త ఉంటుంద‌నే అంచ‌నాలో మ‌రి కొంద‌రు అధికారులు ఉన్నారు. అయితే, ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా త‌మ పోస్టుల్లో తాము కొన‌సాగాల్సిందేన‌ని మ‌రి కొంద‌రు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.  మొత్తం మీద జగన్ సీఎం అవుతాడు అన్న టాక్ తో ఇపుడు ఐఏఎస్, ఐపీఎస్  అధికారులు సైతం కీలకమైన పోస్టుల కోసం పైరవీలు షురూ చేశారనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: