రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చానెల్‌గా గుర్తింపు సాధించిన టీవీ 9 విష‌యంలో ఈ ఛానెల్ సీఈవో ర‌వి ప్ర‌కాశ్‌వ్య‌వ‌హ‌రించిన తీరు అనేక సందేహాల‌కు ఆస్కారం ఇస్తోంది. నిత్యం స‌త్య‌ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లించే ర‌వి.. ఫోర్జ‌రీకి పాల్ప‌డ‌డం, నియంతృత్వ ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌డం వంటి అంశాలు తెలుగు ప్ర‌జ‌ల‌ను నివ్వెర‌పాటుకు గురి చేశాయి. 2017 వ‌ర‌కు స‌జావుగానే సాగిన ఛానెల్ వ్య‌వ‌హారం 2018 నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వీటి వెనుక ర‌వి ప్ర‌కాశ్ హ‌స్తం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వ‌కంగానే సంస్థ‌లో త‌న ఆధిప‌త్యాన్ని నిరూపించుకునేందుకు, బోర్డును హైజాక్ చేసేందుకుకూడా ర‌వి ప్ర‌కాశ్ వ్య‌వ‌హ‌రించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 


టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్‌)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్‌ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది.  ఏబీసీఎల్‌లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న నగదు కూడా చెల్లించింది.  


దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది.  దీంతో ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ, ఏబీసీఎల్ కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ఏబీసీఎల్ యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్రం మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్‌కు సమాచారం పంపింది. 


అయితే, ఏబీసీఎల్‌ లో పెట్టుబడికి సంబంధించి తలెత్తిన ఒక వివాదంలో మారిషస్‌కు చెందిన సైఫ్ త్రీ మారిషస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ జనవరి, 2018లో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీనిపై  విచారణ జరిపిన ఎన్సీఎల్‌టీ..   ఏబీసీఎల్‌ తన ఆస్తులను కానీ, షేర్లను కానీ అమ్మరాదని సెప్టెంబర్ 4, 2018న ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఆదేశాలను యదావిధిగా కొనసాగిస్తూ ఎన్ సీఎల్‌టీ జనవరి 21, 2019న మరో మధ్యంతర ఉత్తర్వును ఇచ్చింది. ఎన్ సీఎల్‌టీ మధ్యంతర  ఉత్తర్వుల్లో ఎలాంటి ఆంక్షలు లేవు. అలాంటప్పుడు శివాజీకి వ్యక్తిగత హోదాలో తన వద్ద ఉన్న షేర్లు అమ్మేందుకు అంగీకరించిన రవిప్రకాశ్ ఈ ఉత్తర్వులను సాకుగా చూపించి షేర్ల బదిలీని నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏంటి? అనేది ర‌వి ప్ర‌కాశ్‌ను చుట్టుముడుతున్న ప్ర‌ధాన ప్ర‌శ్న 


ఎన్ సీఎల్‌టీ  ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా, కొత్త యాజమాన్యానికి సంబంధించిన నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్‌ బోర్డులో చేర్చుకునేందుకు 2018 అక్టోబర్‌లో ఒకసారి, 2019 జనవరిలో మరోసారి బోర్డు మీటింగులు నిర్వహించి, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరేందుకు ఎలాంటి ఇబ్బంది లేని రవిప్రకాశ్‌కు... తన దగ్గర వ్యక్తిగత హోదాలో ఉన్న 40 వేల షేర్లను శివాజీకి బదలాయించడానికి ఉన్న అడ్డంకి ఏంటో అంతుపట్టనిదిగా ఉంది. పైగా ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందే కానీ, ఈ విషయంలో ఏబీసీఎల్‌కి ఏమాత్రం ప్రమేయం లేదు. సో.. మొత్తంగా ర‌వి ప్ర‌కాశ్ టీవీ 9పై గుత్తాధిప‌త్యం సాధించేందుకు చేసిన చ‌ర్య‌ల్లో భాగంగానే దీనిని చూడాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు నిపుణులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: