టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చుబిగుస్తోందా.. ఆయన అరెస్టుకు రంగం సిద్ధం అయ్యిందా.. తాజాగా వస్తున్న సమాచారం బట్టి చూస్తే.. ఆయన అరెస్టుకు పోలీసులు అంతా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆయన రెండోసారి కూడా విచారణకు హాజరుకాకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు తదుపరి స్టెప్ తీసుకోబోతున్నారు. 


ఒకవేళ పోలీసుల ఎదుట హాజరుకాకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అని సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు రవిప్రకాశ్‌, శివాజీ కోసం గాలించలేదని, 41ఏ నోటీసులకు స్పందించకుంటే.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

పోలీసులు వివరణ ప్రకారం... 161 సీఆర్‌పీసీ ప్రకారం సాక్షుల నుంచి మాత్రమే వివరాలు సేకరిస్తాం. ఫిర్యాదుదారు పేర్కొన్న ఆరోపణల్లో వాస్తవముంటే.. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేస్తాం. ఈ సెక్షన్‌ ప్రకారం కోర్టు నుంచి ఎలాంటి వారెంట్‌ అవసరం లేకుండానే అరెస్ట్‌ చేయొచ్చు. 

ఇదే కేసులో  టీవీ9 మాజీ డైరెక్టర్‌ ఎంవీవీఎన్‌ మూర్తిని ఆదివారం కూడా పోలీసులు ప్రశ్నించారు. ఆయన నుంచి కీలక ఆధారాలను సేకరించారు. అందులో భాగంగానే రవిప్రకాశ్‌, సినీ నటుడు శివాజీకి సీఆర్‌పీసీ 41ఏ కింద త్వరలో నోటీసులు జారీ చేస్తారు. మరుసటి రోజే విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తారు. మొత్తానికి రవి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: