ఏపీలో అధికార టిడిపి నేతలకు ఫలితాలు రాకముందే గెలుపుపై సందేహాలు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు, పోలింగ్ ముగిశాక గెలుపు మాదే అంటూ బీరాలు పోయిన వారందరూ ఇప్పుడిప్పుడే  వాస్తవాలు తెలుసుకుంటూ షాక్ అవుతున్నారు. తాము గెలుస్తామని పైకి చెబుతున్నా...  లోపల మాత్రం పోలింగ్ సరళి తమకు అనుకూలంగా జరగలేదని నివేదికలు రావడంతో టీడీపీలోనే చాలామంది ఈ సారి తమ ప్రభుత్వం కష్టమే అన్న అభిప్రాయాన్ని తమ అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఖ‌చ్చితంగా టిడిపి ప్రభుత్వం రాదని డిసైడ్ అయిన సీనియర్ నేతలు రేపటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే వచ్చే ఐదేళ్లు తమ భవిష్యత్తు ఏంటని ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు. మరికొందరు నేతలు పార్టీ వచ్చినా రాకపోయినా మనకేంటి... మన పనులు కావడానికి అవసరమైతే పార్టీ మరిపోదాం అని కూడా తమ అనుచరులతో చెప్పేస్తున్నారు. 

ఇక సీఎం చంద్రబాబు ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా తమ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమీక్షలు నిర్వహిస్తూ ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిపై... గెలుపోటములపై అభ్యర్థుల నుంచి నివేదికలు స్వీకరిస్తున్నారు. ఈ నివేదికలో చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలుస్తుందని చెబుతున్న మరి కొన్ని చోట్ల మాత్రం మనం వెనుకబడి ఉన్నామని, కొన్నిచోట్ల ఓడిపోతున్నామని ఓపెన్ గానే తన అభిప్రాయాన్ని అభ్యర్థులతో చెప్పేస్తున్నారు. ఇక తాజాగా విజయనగరం లోక్‌స‌భ నియోజకవర్గ సమీక్షలో  చంద్రబాబు మెజార్టీ నియోజకవర్గాల అభ్యర్థులపై తీవ్రమైన అసంతృప్తి గురయ్యారని తెలుస్తోంది.  

ఇక చంద్రబాబు ఈ లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ‌జ‌ప‌తిన‌గ‌రం నియోజకవర్గ సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు అక్కడ పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల అప్ప‌ల‌నాయుడు ఈ సారి తన నియోజకవర్గంలో గట్టిపోటీ ఎదురైందని... 8 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాన‌ని చెప్పార‌ట‌. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు పోయిన ఎన్నిక‌ల్లో 18 వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే... ఇప్పుడు 8 వేలా ?  ఐదేళ్ల పాటు ఎన్నో అభివృద్ధి ప‌నులు జ‌రిగాయి... ఇప్పుడు మెజార్టీ స‌గానికి స‌గం కూడా ఎందుకు రాద‌ని.. ఏం జ‌రిగింద‌న్న ప్ర‌శ్న వేశార‌ట‌.

ఇక వాస్త‌వంగా గ‌జ‌ప‌తిన‌గ‌రంలో పోలింగ్ ముగిశాక వైసీపీ అభ్య‌ర్థి బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య విజయం సాధిస్తార‌ని.. ఐదేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్థి అప్ప‌ల‌నాయుడు తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకోవ‌డంతో చివ‌ర‌కు సొంత పార్టీ నేత‌ల‌నుంచే ఉన్న తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త పోలింగ్‌లో క‌న‌ప‌డింద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అస‌లు టిక్కెట్లు ఇచ్చేముందే ఆయ‌న‌కు సీటు వ‌ద్ద‌ని స్వయానా ఆయ‌న సోద‌రుడు సైతం వ్య‌తిరేకించారు. అయినా చంద్ర‌బాబు ఆయ‌న‌కే సీటు ఇచ్చారు. ఇక అటు అప్ప‌ల‌నాయుడికి సైతం ఓట‌మిపై క్లారిటీ రావ‌డంతోనే ఏదో స‌మీక్ష‌లో చెప్పాలి కాబ‌ట్టి.... మెజార్టీ త‌గ్గుతుంద‌ని చెప్పి స‌రిపెట్టుకున్న‌ట్టు టాక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: