హిందూపురం. అనంత‌పురం జిల్లాలోని టీడీపీకి ప‌ట్టున్న కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ముఖ్యంగా హిందూపురం ఎంపీ స్థానంలో టీడీపీకి మంచి ప‌ట్టుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి మంచి ప‌ట్టుంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌. ప‌ద్మశాలి సామాజిక వ‌ర్గానికి చెందిన నిమ్మ‌లకు ఆ వ‌ర్గం ఇప్ప‌టి వ‌ర‌కు తోడుగా ఉంటూ వ‌చ్చింది. అదేస‌మ‌యంలో టీడీపీకి ఈ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గ‌ట్టి ప‌ట్టుండ‌డంతో గ‌డిచిన రెండు సార్లు కూడా నిమ్మ‌ల గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌గా మారింది. 

ప్ర‌ధానంగా హిందూపురం, పుట్ట‌ప‌ర్తి, ధ‌ర్మ‌వ‌రం, పెనుకొండ‌ల‌లో కిష్ట‌ప్ప‌కు అనుకూల ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఈ ద‌ఫా కూడా ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ఇక్క‌డ కిష్ట‌ప్ప గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు. వైసీపీ నుంచి పోలీస్ మాజీ అధికారి, కుర‌బ సామాజిక వ‌ర్గానికి చెందిన గోరంట్ల మాధ‌వ్ బ‌రిలో నిల‌వ‌డంతో కిష్ట‌ప్ప‌కు ఎదురు గాలులు వీచాయ‌ని అంటున్నారు. కుర‌బ సామాజిక వ‌ర్గం ఈ పార్ల‌మెంటు ప‌రిధిలో ఎక్కువ‌గా ఉండ‌డం, జిల్లా వ్యాప్తంగా కూడా మాధ‌వ్‌కు సానుకూల ప‌వ‌నాలు ఉండ‌డంతో కిష్ట‌ప్ప ఎదురొడ్డిన‌ట్టు తెలుస్తోంది. 

వాస్త‌వానికి తాజా ఎన్నిక‌ల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని భావించిన కిష్ట‌ప్ప‌కు సొంత పార్టీ టీడీపీలోనూ ఎదురు గాలి వీచింద‌ని అంటున్నారు. ముఖ్యంగా పెనుగొండ ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి, పుట్ట‌ప‌ర్తి ఎమ్మెల్యే ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిల‌తో కిష్ట‌ప్ప‌కు ఉన్న విభేదాల‌తో ఈ ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రూ కూడా ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌నేది టీడీపీ నేత‌ల మాట‌. మ‌రోప‌క్క‌, సొంత సామాజిక వ‌ర్గానికి కూడా ఆయ‌న ఏమీ చేసింది లేద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ కిష్ట‌ప్ప హ్యాట్రిక్ ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయ‌నే సందేహం ఉంది. ఓట్లు చీలిక వ‌స్తే. కిష్ట‌ప్ప‌కు అనుకూల వాతావ‌ర‌ణం అస్స‌లు ఉండ‌ద‌ని కూడా అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుంతో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: