మరో 9 రోజుల్లో ఫలితాలు వెలువడనున్న సమయంలో, ఏపీ రాజధాని అంశం టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే ప్రచారం వేడిగా జరుగుతోంది.
ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు రాజధాని ఏర్పాటను కొందరు ప్రకాశం జిల్లా, దొనకొండ అంటే, మరికొందరు కష్ణా జిల్లా, నూజివీడు అంటూ ప్రచారం చేశారు. రాజధాని ఆ రెండు ప్రాంతాల్లో వస్తుందని రియల్టర్లు భూములు ధరలు భారీగా పెంచారు. తరువాత ఎవరూ ఊహించని విధంగా అమరావతి రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని ప్రకటించడంతో, అందరూ అయోమయంలో పడి తేరుకొని మళ్లీ అక్కడ భూములు కొనేందుకు పోటీ పడటంతో గతంలో లక్షల్లో ఉన్న భూమి, తర్వాత కోట్లకు పడగెత్తింది.తాజా ఎన్నికల నేపథ్యంలో, రాజధాని అంశంపై కొత్త వార్తలు కార్పొరేట్‌ సర్కిళ్లలో సందడి చేస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో జగన్‌ సీఎం అయితే, రాజధానిని తరలించక పోయినప్పటికీ అమరావతి పరిధిలో రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాలను కాకుండా, కేవలం 12 వేల ఎకరాల్లో మాత్రమే రాజధాని నిర్మించి, మిగిలిన కేటాయింపులను రద్దు చేస్తారనే టాక్‌ ఎక్కువగా ఉంది. అయితే, వైఎస్సార్‌సీపీ మ్యానిఫెస్టోలో రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చిన జగన్‌ దానికి కట్టుబడి ఉంటారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, రాజధాని విషయంలో జగన్‌ దగ్గర ఒక స్పష్టమైన మాస్టర్‌ ప్లాన్‌ ఉందని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. అమెరికా సంయుక్త రాప్ట్రాల మాదిరిగా అంధ్రప్రదేశ్‌లోని, అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనేది జగన్‌ మదిలో ఉన్న ఆలోచనగా చెబుతున్నారు.
అమరావతిలో ఇపుడు నిర్మిస్తున్న తాత్కాలిక భవనాలను అలాగే ఉంచి, ప్రధానమైన శాఖలను ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు అనంతపురం లాంటి కరవు ప్రాంతంలో వ్యవసాయ శాఖను పెడితే, ఆ ప్రాంతం పై అధికారులు ఎక్కువ దృష్టి పెట్టి, అక్కడ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ,రంపచోడవరం మన్యం సమీపంలో గిరిజన శాఖను ఏర్పాటు చేస్తే అక్కడి గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాడానకి వీలవుతుంది. 
అభివృద్ది అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, అన్ని జిల్లాలకు విస్తరించడం వల్ల అన్ని ప్రాంతాలు అర్ధికంగా ఎదుగుతాయని జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ లక్ష్యం. '' అధికార వికేంద్రీకరణ వల్ల ప్రాంతీయ విభేదాలు తగ్గి , నగరాల అభివృద్ది జరుగుతుంది. ప్రతీ జిల్లా ఒక రాజధానిలా అభివృద్ది చెందుతుంది.'' అని వైఎస్సార్‌సీపీ ప్రజారోగ్యవిభాగం అధ్యక్షుడు అన్నపరెడ్డి విజయభాస్కర రెడ్డి అన్నారు.
 రాజధాని ప్రకటన వచ్చినప్పటి నుంచి 29గ్రామాల స్వరూపం మారిపోయి, మొన్నటివరకు మూడు పంటల పై ఆధారపడిన ఆయా గ్రామాలు ఇప్పుడు వ్యాపార కూడళ్లుగా మారడం పర్యావరణ వేత్తలను ఆందోళన పరుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: