మే 23 దగ్గరకు వస్తున్నకొద్దీ నేతల్లో ఎలక్షన్ కౌంటింగ్ టెన్షన్ మొదలవుతోంది. ఈసీ కూడా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంది. ఈసారి కొత్తగా వీవీ ప్యాట్ యంత్రాలు వాడటంతో ఏజంట్లు కీలకపాత్ర పోషించబోతున్నారు. అందుకే ఏజంట్ల నియామకానికి కొన్ని నిబంధలు పెట్టారు. 


మొత్తం 15 టేబుళ్లకు ప్రతీ అభ్యర్థికీ కనీసం 15 మంది ఏజెంట్లు అవసరమవుతారు. అదే విధంగా పార్లమెంటుకు, శాసనసభకు వేర్వేరుగా టేబుళ్లు ఏర్పాటుచేస్తారు కాబట్టి నియోజకవర్గానికి ప్రతీ పార్టీ కనీసం 30 మంది ఏజెంట్లను నియమించుకోవాల్సి వస్తుంది. కొన్నిచోట్ల ప్రత్యేక అనుమతితో అదనపు టేబుళ్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 

ఈసారి ఏజెంట్ల నేర చరిత్రనీ ఈసీ పరిశీలిస్తోంది. ఏజంట్లుగా కొందరు అనర్హులవుతారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు ఏజంట్లుగా పనిచేయరాదు. పార్లమెంటు,శాసనసభ,శాసన మండలి సభ్యులు,  మేయర్లు, మున్సిపల్, నగర పంచాయితీ చైర్మన్లు ఏజంట్లుగా కూర్చోకూడదు.  జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, బ్లాక్‌ లెవెల్, పంచాయితీ సమితి చైర్‌పర్సన్లు కూడా ఏజంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. 

ఏజంట్లను ఫారం–18 దరఖాస్తు ద్వారా నియమించుకోవాలి. అభ్యర్థి తాను నియమించుకోబోయే  ఏజెంటు పేరు, చిరునామాతో పాటు ఫొటోలు జతచేసి సంతకం చేసి రెండు కాపీలు ఇవ్వాలి.  ఓట్ల లెక్కింపునకు మూడు రోజులు ముందు అంటే మే 20 సాయంత్రం 5 గంటల లోపు ఏజెంట్ల వివరాలను రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి.  కౌంటింగ్‌ సమయంలో ఈసీ ఇచ్చే గుర్తింపు కార్డు, నియామక పత్రం చూపించాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: