తెలంగాణ సీఎం కేసీఆర్ కు దైవభక్తి ఎక్కువ.. అలాగే యజ్ఞాలు, యాగాల పట్ల కూడా మక్కువ ఎక్కువ. ఈ సంగతి రాష్ట్రానికంతా తెలుసు. ఆయన అధికారంలోకి వచ్చేందుకు యాగాలు కూడా చేశారు. అంతే కాదు.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే.. స్వాముల పట్ల అధిక భక్తి చూపిస్తారు.. ఏకంగా సాష్టాంగపడి నమస్కారాలు చేస్తారు.


ఓ ముఖ్యమంత్రి బహిరంగంగా అలా స్వామీజీలకు సాష్టాంగ నమస్కారాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా.. ప్రముఖ విద్యావేత్త కంచె ఐలయ్య  ఈ అంశంపై పదునైన విమర్శలు గుప్పించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ కాకుండా.. చినజీయర్ పరిపాలిస్తున్నారని ఆరోపించారు. 

దళితులు, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఇంతవరకు ఏ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించలేదని విమర్శించారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చినచోటే తిరిగి ప్రతిష్టించాలని ఐలయ్య కోరారు. అంబేద్కర్‌తో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదన్నారు. హైదరాబాద్ పంజాగుట్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని తరలించిన విషయం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. 

అక్కడ అనుమతి లేకుండా విగ్రహం పెట్టారంటూ మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించారు. ఈ క్రమంలో ఆ విగ్రహం విరిగింది..దాన్ని చెత్త కుప్పలో పడేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై సీపీఎం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ సభలోనే కంచె ఐలయ్య.. ఈ తీవ్ర విమర్శలు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: