ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌లకు, ఫ‌లితాల‌కు మ‌ధ్య ఏకంగా 45 రోజుల గ‌డువు ఉంది. గ‌తంలో ఏ ఎన్నిక‌ల‌కు లేని విధంగా ఇంత గ్యాప్ ఉండ‌డంతో బెట్టింగ్ రాయుళ్లు మాత్రం బాగా పండ‌గ చేసుకుంటున్నారు. అటు వైపు, ఇటు వైపు బెట్టింగ్‌ల‌ను ప్రోత్స‌హిస్తూ బాగా క‌మీష‌న్లు గుంజుకునే ప్ర‌య‌త్నాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇక ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యేందుకు మ‌రో వారం రోజులు మాత్ర‌మే ఉంది. దీంతో బెట్టింగులు ఒక్క‌సారిగా ఊపందుకున్నాయి. గ‌తంలో బెట్టింగ్‌ల‌కు కాసేందుకు మ‌హా అయితే 1015 రోజుల టైం మాత్ర‌మే ఉండేది. ఇప్పుడు చాలా గ్యాప్ ఉండ‌డంతో బెట్టింగ్‌ల‌కు కాసే వారు సైతం డైల‌మాలోనే ఉంటున్నారు. ముందు ఒక పార్టీ గెలుస్తుంద‌ని.. లేదా ఫ‌లానా అభ్య‌ర్థి గెలుస్తాడ‌ని పందేలు కాసిన వారు ఇప్పుడు రివ‌ర్స్ గేర్‌లో పందేలు కాస్తున్నారు.

ఎవ‌రి అంచ‌నాలు... ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా మెజార్టీ స‌ర్వేల లెక్క‌ల‌న్ని వైసీపీ వైపే ఉన్నాయి. ఇక స‌హ‌జంగానే బెట్టింగ్ రేటు కూడా వైసీపీ వైపే ఎక్కువుగా న‌డుస్తోంది. వైసీపీకి అనుకూలంగా ర‌క‌ర‌కాల పందేలు న‌డుస్తున్నాయి. జ‌గ‌న్ సీఎం అవుతాడ‌న్న పందేలు స‌హ‌జంగానే భారీ ఎత్తున న‌డుస్తున్నాయి. రాయల‌సీమ‌కు చెందిన బెట్టింగ్ రాయుళ్లు ఏపీలోని ఉభ‌య‌గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లో మ‌కాం వేసి మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా గెలిచేది వైసీపీయే.. సీఎం జ‌గ‌నే అని కోట్ల‌లో పందెం కాస్తున్నారు. 

అలాగే టీడీపీ కంటే ఒక్క సీటు వైసీపీకి ఎక్కువ వ‌స్తుంద‌ని కూడా పందేలు వేస్తున్నారు. ఇక పోలింగ్ ముగిసిన వెంట‌నే టీడీపీ గెలుస్తుంద‌ని కృష్ణా జిల్లాలో పందేలు వేసిన వారికి ఇప్పుడు సందేహం రావ‌డంతో ఇప్పుడు వారు పందేలను వెన‌క్కు తీసుకుంటున్నారు. అయితే ఇక్క‌డ ఫ‌లితంతో సంబంధం లేకుండా తాము పందెం కాసిన మొత్తంలో స‌గం ఇస్తే చాలని పందేలను వ‌దిలేసుకుంటున్నారు. ఒక వేళ రేపు టీడీపీ గెలిచినా కూడా వీరికి పందెం రాదు. అంటే ముందుగానే విత్ డ్రా అయిపోతున్నారు.

గుంటూరు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ వాళ్లు మూడు సీట్లు చెప్పి... ఆ మూడు సీట్ల‌లోనూ వైసీపీ గెలుస్తుంద‌ని... మూడింట్లో ఒక‌సీట్లో వైసీపీ ఓడినా త‌మ‌కు పందెం అక్క‌ర్లేద‌ని.. మూడు సీట్ల‌లో ఒక్క‌చోట టీడీపీ గెలిచినా పందెం వ‌దులుకుంటామ‌ని స‌వాళ్ల‌కు దిగుతున్నారు. ఇదే త‌ర‌హా పందెం గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో ఉన్న మూడు సీట్ల మీద కూడా న‌డుస్తోంది. అలాగే ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న మూడు సీట్ల‌లోనూ ఈ త‌ర‌హా బెట్టింగ్ న‌డుస్తోంది. 

ఇక కృష్ణా జిల్లాలోని గుడివాడ‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు ?  గెలుస్తారు ? అనే అంశంపై ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల గురించి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు న‌డుస్తున్నాయి. ఇక గుంటూరు జిల్లాలో టీడీపీ హ‌వా ఉన్నా కూడా వైసీపీ వ‌ర్గాలు రెండు ఎంపీ సీట్లు ప‌క్కాగా గెలుస్తామ‌ని పందెం వేస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు ఎంపీ సీట్ల విష‌యంలోనూ వైసీపీ జోరే న‌డుస్తోంది. గోదావ‌రి జిల్లాల్లో రెండు ఎంపీ సీట్ల‌లో ఖ‌చ్చితంగా వైసీపీ గెలుస్తుంద‌ని రూపాయికి రెండు రూపాయ‌లు బెట్ వేస్తున్నారు. ఏదేమైనా ఏపీ ఫ‌లితాల బెట్టింగుల్లో వైసీపీ జోరు మామూలుగా లేదు. మ‌రి ఫ‌లితాల్లో ఎలా ఉంటుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: