ఇంటర్ ఫలితాలపై మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఇంట‌ర్ రీ వెరిఫికేష‌న్ ఫ‌లితాల‌ను మే 27న ప్రకటించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటుగా ఇంటర్ ఫలితాల కేసుపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు..దీనిపై  గ్లొబరినా సంస్థకు నోటీసులు  ఇచ్చింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల రీ వేరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేశామని ఇంటర్ బోర్డు కోర్టుకు తెలిపింది.  ఫలితాలు, సమాధాన పత్రాలను ఒకేసారి ప్రకటించాలని ఇంటర్ బోర్డు హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సమాధాన పత్రాలు మే 27న నెట్ లో ఉంచుతామని  బోర్డు తెలిపింది.


గత నెల18న ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, అందులో అనేక తప్పులు దొర్లాయని పేరెంట్స్‌‌, స్టూడెంట్స్‌‌ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఐదు రోజులైనా గొడవలు తగ్గకపోవడంతో ప్రభుత్వం అదేనెల 22న ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ వేసింది. మూడు రోజుల్లో ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌‌రెడ్డి చెప్పారు. తర్వాతా నిరసనలు కొనసాగడం, అవి ప్రగతిభవన్‌‌కూ తాకడంతో సీఎం కేసీఆర్‌‌ స్పందించారు. ఉచితంగా రీవెరిఫికేషన్‌‌, రీకౌంటింగ్‌‌ అని ప్రకటించారు. ఈ సమయంలోనూ తప్పు జరిగిందని ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. అనంతరం రెండు రోజులకు ప్రభుత్వానికి టీఎస్‌‌టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. మరోపక్క విపక్షాలు, స్టూడెంట్స్‌‌ యూనియన్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా సంస్థతోపాటు ఇంటర్‌‌ బోర్డు పాత్ర కూడా ఉందని త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఏఏ పనుల్లో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని అనుబంధ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. కానీ ఇప్పటికీ ఏ అధికారికీ కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. ఇంటర్‌‌ బోర్డు కార్యదర్శి అశోక్‌‌ కుమార్‌‌ను రీకౌంటింగ్‌‌, రీవెరిఫికేషన్‌‌తోపాటు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌‌రెడ్డికి అప్పగించింది. అయినా అశోక్‌‌ మాత్రం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: