ఎన్నికల ఫలితాలు నిలబడేందుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు ఏపీలో  ఎక్కడ చూసినా పొలిటికల్ బెట్టింగ్‌ల హీట్ ఎక్కువైంది. కీలకమైన పశ్చిమగోదావరి జిల్లాలో సైతం పట్టణం నుంచి ప్రతి పల్లె వరకు బెట్టింగ్‌ల హడావిడి నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసిపి ఒక్క సీటు గెలుచుకోలేదు.  ఈ సారి ఎలాగైనా టిడిపి కంచు కోట కొట్టాలని రెండు సంవత్సరాల నుంచే పక్కా ప్లానింగ్ తో ఉన్న వైసిపి.. టీడీపీ సిట్టింగ్‌లకు ధీటుగా అన్ని విధాలా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసింది. పోలింగ్ ముగిసిన‌ప్పటి నుంచే జిల్లాలో తామే మెజార్టీ సీట్లు సాధిస్తామన్న ధీమాతో ఉన్న వైసిపి భారీ ఎత్తున బెట్టింగులు క‌డుతోంది. వైసిపి సానుభూతిపరులు హెచ్చు పందాలతో టిడిపి వాళ్లను క‌వ్విస్తున్నారు. ఏలూరు లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు అసెంబ్లీ సీట్లలో టీడీపీ ఒక్క సీటు గెలిచినా పందెం వ‌దులుకుంటామ‌ని స‌వాల్ చేస్తుండ‌డం విశేషం. 


వైసిపి వాళ్ళు చెప్పిన మూడు సీట్లలో ఒకచోట వైసిపి ఓడినా వాళ్ళు పందెం వదులుకుంటారు, వైసిపి మూడు చోట్ల గెలిస్తేనే వాళ్లకు పందెం వెళుతుంది.  పోలవరం, చింతలపూడి సీట్లపై వైసిపి సానుభూతిపరులు రూపాయికి రెండు రూపాయలు ఇచ్చి మరి పందేలకు దిగుతున్నారు. ఉంగుటూరులోనూ వైసీపీ గెలుస్తుందని హెచ్చు పందాలు న‌డుస్తున్నాయి.  ఏలూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోటగిరి శ్రీధర్ గెలుస్తాడని ముందుగా సమంగా పందాలు కాసిన వైసీపీ శ్రేణులు ఫలితాలు వెలువడేందుకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఏకంగా రూపాయికి రెండు రూపాయలు ఇస్తున్నారు. అయినా  టిడిపి వాళ్ళు ధీమాగా ముందుకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. 


ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌లుగా ఉన్న రాజ‌మండ్రి లోక్‌స‌భ ప‌రిధిలో ఉన్న గోపాల‌పురం, కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గాల‌పై సైతం వైసీపీ ధీమాతో పందాల‌కు దిగుతోంది. జిల్లాలో రెండు ఎంపీ సీట్ల‌తో పాటు మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామ‌ని పందాలు కాస్తున్న వైసీపీ... టీడీపీ కంటే వైసీపీకే ఒక్క సీటు అయినా  ఎక్కువ వ‌స్తుంద‌న్న పందెం కూడా భారీ ఎత్తున్న కాస్తోంది. అలాగే న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో జ‌న‌సేన గెలిచే సీట్ల‌పై సైతం భారీగా పందాలు న‌డుస్తున్నాయి. జిల్లాలో జ‌న‌సేన‌కు ఒక్క సీటు అయినా వ‌స్తుంద‌న్న పందెం న‌డుస్తోంది. ఇక జ‌న‌సేన‌కు స్టైడ్ వైడ్‌గా 5-6 సీట్ల‌కు మించి రావ‌ని కూడా ప‌శ్చిమ వైసీపీ శ్రేణులు పందేలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో బెట్టింగ్‌ల‌లో మాత్రం వైసీపీ జోరు ముందు టీడీపీ కాస్త డీలా ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి ఫైన‌ల్‌గా ఫ‌లితాల్లో ఏ పార్టీ జోరు ఉంటుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: