చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పై వేటు వేయటానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా అవకతవకలు జరిగినా, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగినా, రిగ్గింగ్ జరిగినా కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ రిపోర్టు పంపటమే ఇపుడు ఆయన మెడకు చుట్టుకుంటోందని సమాచారం.

 

ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ సందర్భంగా జిల్లాలోని పుంగనూరు, చంద్రగిరి, తంబళ్ళపల్లి, పూతలపట్టు నియోజకవర్గాల్లో చాలా గొడవలే జరిగాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలను పగలగొట్టటం, పూతలపట్టు వైసిపి అభ్యర్ధిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు ప్రత్యర్ధులు. పూతలపట్టులో జరిగిన దాడిలో వైసిపి కార్యకర్త మరణించారు. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి చేసిన అరాచకాలకైతే అంతేలేదు.

 

ఇన్ని గొడవలు  జరిగినా  జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ప్రద్యుమ్న నివేదిక ఇవ్వటంతో అందరూ ఆశ్చర్యపోయారు. వైసిపి నేతలు చంద్రగిరిలోని ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను కలెక్టర్ కు పంపి నివేదిక కోరారు. అయితే వైసిపి ఫిర్యాదులో వాస్తవాలు లేవని కలెక్టర్ సమాధానమిచ్చారట. ఎస్పీని అడిగితే ఎస్పీ కూడా అలాగే నివేదిక ఇచ్చారట.

 

ఇక లాభం లేదనుకున్న కేంద్ర ఎన్నికల కమీషన్ నేరుగా మాట్లాడి విచారణకు ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేది వైసిపి ఫిర్యాదు చేసిన ఏడు పోలింగ్ కేంద్రాల్లోని వెబ్ క్యాస్టింగ్ ఫుటేజిని పరిశీలించిందట. అందులో ఐదు కేంద్రాల్లో రిగ్గింగ్ చేసుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయట. దాంతో ఫుటేజీ దృశ్యాలతో పాటు నివేదికను పంపారని సమాచారం. ఫుటేజీని పరిశీలించిన సీఈసీకి అంతకుముందు కలెక్టర్ పంపిన నివేదికను పోల్చుకున్నారట. తర్వాతే రీ పోలింగ్ కు ఆదేశించారు.

 

మొత్తానికి ద్వివేది నివేదికను చూసిన తర్వాతే అంతకు ముందు కలెక్టర్ పంపిన నివేదికలోని డొల్లతనం బయటపడింది. కలెక్టర్ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు నివేదికను పంపినట్లు సీఈసీ మండిపోతోంది. అదే విషయాన్ని వైసిపి నేతలు విజయసాయిరెడ్డి అండ్ కో కూడా ఫిర్యాదు చేశారు. అన్నీ కోణాల నుండి విచారించిన తర్వాతే కలెక్టర్ ప్రద్యుమ్నపై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. చర్యలంటే బదిలీ చేస్తారా ? లేకపోతే సస్పెన్డ్ చేస్తారా ? అన్నదే సస్పెన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: