ఎన్నిక‌లంటే.. సానుభూతి, సామాజిక‌వర్గాల బ‌లం, అనుచ‌రుల హ‌డావుడితోపాటు ఆర్థికంగా కూడా కేంద్రంగా మారిపోయా యి. అప్ప‌టి వ‌ర‌కు పాలు పెరుగు అమ్ముకుని పొట్ట‌పోసుకుంటున్నామ‌ని చెప్పిన నాయ‌కులు కూడా క‌ట్ట‌ల‌కు క‌ట్ట‌లు బ‌య‌ట‌కు తీసిన సంద‌ర్భాలు తాజా ఎన్నిక‌ల్లో క‌నిపించాయి. ముఖ్యంగా గెలుపు గుర్రం ఎక్కి తీరాల‌నే క‌సితో.. వైసీపీ, టీడీపీ నాయ‌కులు పోటీకి దిగారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారాన్ని హోరెత్తించారు. ఈ క్ర‌మంలోనే అన్ని వ‌ర్గాల‌ను త‌మ‌కు అనుకూలంగా ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నాయ‌కులు డ‌బ్బుల క‌ట్ట‌ల‌ను సైతం వెద‌జ‌ల్లారు. ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లా రాజ‌ధాని ప్రాంత‌మైన పెద‌కూర‌పాడు నియోజ‌వ‌ర్గంలోనూ ఇరు పార్టీల అభ్య‌ర్థులు విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చుల‌కు తెర‌లెత్తారు. 


ఇక్క‌డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుం టున్నారు. ఇక‌, వైసీపీ నుంచి నంబూరు శంక‌ర్రావు రంగంలోకి దిగారు. ఇద్ద‌రూ కూడా క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే కావ‌డంతో పోరుకూడా అదే రేంజ్‌లో వ్యూహాత్మ‌కంగా సాగింది. ఎవ్వ‌రూ కూడా వెన‌క్కి తిరిగి చూసుకోకుండా ముందుకు దూసుకుపోయారు. ఎట్టిప‌రిస్థితిలోనూ ఇక్క‌డ నుంచి మూడో సారి గెలిచి హ్యాట్రిక్ దిశ‌గా దూసుకుపోయి.. హిస్ట‌రీ సృష్టించాల‌ని కొమ్మాల‌పాటి నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇక్క‌డ తాడో పేడో తేల్చుకునే రేంజ్‌లో పోరాడారు. 


గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ కొమ్మాల‌పాటి 9 వేల ఓట్ల మెజార్టీతో వ‌రుస విజ‌యాలు సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆయ‌న బ‌లంగా డిసైడ్ అయ్యారు. ఇక‌, ఇక్క‌డ కొమ్మాల‌పాటిని ఓడించి వైసీపీ జెండా ఎగుర‌వేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు ఇన్‌చార్జ్‌ను మార్చి ఆర్థిక‌, సామాజిక‌ప‌రంగా కొమ్మాల‌పాటికి ధీటైన అభ్య‌ర్థిగా ఉన్న నంబూరు శంక‌ర‌రావును రంగంలోకి దించారు. ఈ నేప‌థ్యంలో నంబూరి కూడా తాడో పేడో అన్న‌ట్టుగానే ఎన్నిక‌ల పోరును ఉద్రుతం చేశారు.  ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు నాయ‌కులు కూడా వంద‌ల కోట్ల రూపాయ‌లు ప్ర‌చారానికి ప్ర‌జ‌ల‌కు కూడా ఖ‌ర్చు చేశార‌ని స‌మాచారం. 


గుంటూరు జిల్లాలో భారీగా నోట్ల క‌ట్ట‌లు తెగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద‌కూర‌పాడు టాప్ ప్లేస్‌లో ఉంది. నంబూరు శంక‌ర‌రావు కేవ‌లం ఓట‌ర్ల‌కే రూ.75-80 కోట్లు పంచ‌గా.. ఎన్నిక‌ల ప్ర‌చారం, నాయ‌కుల‌ను మేనేజ్ చేసేందుకు చివ‌రి ఆరు నెల‌ల్లో పెట్టిన ఖ‌ర్చు మ‌రో రూ.50 కోట్లు దాటిందంటున్నారు. ఇక శ్రీధ‌ర్ కూడా చివ‌రి ఆరు నెల‌ల ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌, ప్ర‌చారం ఓట్లు కొనుగోలు చేసేందుకు రూ.100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశారని టాక్‌. మొత్తంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 250 కోట్ల మేర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇంత ఖ‌ర్చు పెట్టిన త‌ర్వాత ఇక్క‌డ గెల‌వ‌క‌పోతే.. ప‌రిస్థితి ఏంటి ? అనేది కూడా ప్ర‌ధానంగా అభ్య‌ర్థుల‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌. ఇరు పార్టీలు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఐదు మండ‌లాల్లో మూడు మండ‌లాల్లో త‌మ‌కే మెజార్టీ వ‌స్తోందంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే స‌ర్వేల‌పై స‌ర్వేలు చేయించుకుంటూ.. ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 23న వ‌చ్చే ఫ‌లితం ఇక్క‌డ కీల‌కంగా మారింది. మ‌రి ఎవ‌రి ఆశ‌లు ఫ‌లిస్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: