ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా సంస్థ దర్శకత్వంలో దాదాపు మూడు నెలలు ఎంతో శ్రమ కూర్చి దేశం నలుమూలలా చిత్రీకరించిన భారీ చిత్రం ELECTIONS -2019. నేడు ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విభిన్నంగా రాబోతోంది.  ఫస్ట్ లుక్ అన్నీ మీడియాలలో ఒకేలా వుండదు. ఈ సంచలన చిత్రానికి ఎన్నో విశేషాలున్నాయి. ఇది దేశంలోనే అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రం. ఈ చిత్రానికి నటీనటులే నిర్మాతలు.. అంతేకాదు నటీనటుల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం చరిత్ర పుటలకెక్కిందనడంలో సందేహం లేదు.


ELECTIONS -2019 చిత్రీకరణ సమయంలో ముఖ్యంగా నటీనటులు ఎంతో ఒత్తిడికి లోనయ్యారని భోగట్టా. చిత్రం మొత్తం ఏడు షెడ్యూలలో ప్లాన్ చేయగా నటీనటుల సమన్వయ లోపంతో కొన్ని చోట్ల హింస చెలరేగి కొన్ని సీన్స్ రీషూట్ చేయడం జరిగింది. చిత్రనటీనటులు ఓ పక్క నటిస్తూ మరో పక్క నిర్మాతలుగా వ్యవహరించిన తీరు దర్శకులను (ఎలక్షన్ కమీషన్) ఆశ్చర్యానికి లోను చేసిందని సమాచారం. ELECTIONS -2019 ఈ రోజు షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుని 23 వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకలు.


ఈ చిత్రమ్మీద నిర్మాతలకే కాదు ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కారణం చిత్రీకరణ సమయంలో తీసుకన్న నిడివే. ప్రీప్రొడక్షన్, షూటింగ్ దాదాపు 6నెలలు తీసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో నే పూర్తి సినిమా చూడొచ్చని కొన్ని వర్గాలు గట్టిగా నొక్కి ఒక్కాణిస్తున్నాయి.  ఏదేమైనా సాయంత్రం రిలీజ్ అవ్వబోయే ఫస్ట్ లుక్ కే ఇంత క్రేజ్ వున్న ఈ చిత్రం 23 వ తారీఖు ఇంకెన్ని సంచలనాలకు తెర తీస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: