టీవీ9లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిధుల మ‌ళ్లింపు స‌హా ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసుల విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ తాము ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా.. వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడంతో తదుపరి చర్యల కింద పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి లుక్‌అవుట్ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. నిందితులిద్దరూ దేశం విడిచివెళ్లకుండా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు పోలీసులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఇప్ప‌టికే రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేయ‌డం తాజాగా  సైబరాబాద్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీచేయ‌డంతో ద‌ర్యాప్తులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం ఖాయ‌మంటున్నారు.


మ‌రోవైపు, మఓ న్యాయ‌వాది ఆధారంగా టీవీ9 అవ‌క‌త‌వ‌క‌ల గుట్టు తేల్చుతున్న‌ట్లు స‌మాచారం. రవిప్రకాశ్, శివాజీ మధ్య షేర్ల డ్రామాను సృష్టించిన పత్రాల వెనుక సూత్రధారిగా ఉన్న న్యాయవాది జే కనకరాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, రోడ్డునంబర్ 3, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీలోని న్యాయవాది ఇంట్లో దాదాపు ఆరుగంటలకు పైగా పోలీసులు సోదాలుచేశారు. షేర్ల డ్రామా కోసం సృష్టించిన పత్రాలను రూపొందించిన ల్యాప్‌టాప్‌తోపాటు పలు ఎలక్ట్రికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలను శక్తి ఐడీ ద్వారా వాటిని రవిప్రకాశ్, శివాజీలకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ న్యాయవాది రవిప్రకాశ్‌కు ఇంకా ఏ విధంగా సహకరించాడనే విషయంలో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. టీవీ9కు న్యాయసలహాదారుడిగా కనకరాజు పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో కేరళ రాష్ట్రంలో వైద్యచికిత్సలు పొందుతున్నట్లు అతని కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.


రవిప్రకాశ్ జాడ కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు.. ఏపీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆరాతీస్తున్నారు. పలుకోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల గడువు ముగియడానికి ముందే రవిప్రకాశ్ తన ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేశారు. రవిప్రకాశ్ సన్నిహితులెవరు? ఆయన ఎక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది? ఎవరు ఆయనకు ఆశ్రయం ఇవ్వొచ్చు.. అన్న కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలతోపాటు రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుంటే.. కేసులో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: