మహామహులు ప్రాధాన్యం వహించిన గుంటూరు లోక్‌స‌భ నియోజకవర్గంలో ఈ సారి విజేతపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. లోక్ సభలో తమ వాగ్దాటితో తెలుగువాడికి వినిపించిన ఇద్దరు ఎంపీలు టిడిపి,  వైసీపీ తరపున ఇక్కడ హోరాహోరీగా పోరాడుతున్నారు. వీరిద్దరూ ఇదే జిల్లా నుంచి టీడీపీ తరపున ఎంపీలుగా గెలిచిన వారే కావడం విశేషం. గుంటూరు లోక్‌స‌భ నుంచి సిట్టింగ్ ఎంపీగా గల్లా జయదేవ్ తిరిగి పోటీ చేస్తే వైసీపీ నుంచి గతంలో టిడిపి తరపున నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల రెడ్డి రంగంలో ఉన్నారు. హేమాహేమీలను హస్తినకు పంపిన గుంటూరులో ఈ సారి గెలుపు ఎవరి ? తలుపు తడుతుంది అన్న ఆసక్తి  రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఉంది. ఎన్నికలకు ముందు వరకు ? టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక టీడీపీలోకి జంప్ చేసి వైసీపీ నుండి ఎంపీగా బరిలో ఉన్నారు. 


ఇద్దరు సమ ఉజ్జీలు అయిన నేతలు రంగంలో ఉండడంతో గుంటూరు లోక్‌స‌భ సీటు కోసం హోరాహోరీ పోరు జరుగుతుందని ముందుగా అందరూ అంచనా వేశారు. తెలుగుదేశం పార్టీ మంగళగిరి నుంచి సీఎం తనయుడు నారా లోకేష్‌ను పోటీ చేయించడంతో గుంటూరు లోక్‌స‌భ సీటు పోరు మరింత ఆసక్తిగా మారింది. జయదేవ్ సిట్టింగ్ ఎంపీ కావడం ఆయనకు ప్లస్ అయితే మోదుగుల పదేళ్ల పాటు జిల్లాలో ప్రజా ప్రతినిధిగా ఉండడంతో పాటు ఆయనకు ఉన్న పరిచయాలు అన్నింటిని ఉపయోగించి ఓటర్లను ఆకర్షించారు. జైయ‌దేవ్ స్థానికేతరుడు అన్న నినాదాన్ని మోదుగుల బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. అలాగే జనసేన నుంచి టిడిపి నేతగా ఉన్న బొన‌బోయిన‌ శ్రీనివాస్ యాదవ్ చివరిలో పార్టీ మారి పోటీ చేయడంతో జనసేన ఓట్లు కూడా తనను గెలిపిస్తాయని మోదుగుల ధీమాతో ఉన్నారు. 


గుంటూరు నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ వర్గానికి చెందిన బొన‌బోయిన‌ శ్రీనివాస్ జనసేన నుంచి రంగంలో ఉండడంతో కాపులు, బీసీల ఓట్లను జనసేన బలంగా చీల్చ‌న‌ట్టు పోలింగ్ సరళి చెబుతోంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ టిడిపికి సపోర్ట్ చేయడంతో కాపుల ఓటింగ్, తమకు సాంప్రదాయమైన  బీసీల ఓట్లు కూడా పడడంతో 69 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన జ‌య‌దేవ్ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేరు. జ‌య‌దేవ్‌ని గుంటూరు జనాలు టీవీల్లో చూడడమే తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు చూసి ఎరుగ‌మ‌ని చెప్పిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక  మంగళగిరి, పొన్నూరు, గుంటూరు సిటీలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థికి అనుకూలంగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. 


ఈ క్రాస్ ఓటింగ్ కూడా జయదేవ్ కొంపముంచుతుంద‌న్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ వాళ్లు మాత్రం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఉండ‌డమే త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌హిళా ఓట్లు త‌మ‌కే ఎక్కువ‌గా ప‌డ్డాయ‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో పురుషుల కంటే మ‌హిళా ఓట‌రు 47,000 ఎక్కువ‌గా ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం త‌మ‌కు క‌లిసిరానుంద‌ని టీడీపీ లెక్క‌లు వేస్తోంది. ఏదేమైనా గుంటూరు లోక్‌స‌భ పరిధిలో జరిగిన క్రాస్ ఓటింగ్, కుల స‌మీక‌ర‌న‌లు ఈ సారి జ‌య‌దేవ్ జోరుకు బ్రేకులు వేస్తున్నాయి. మ‌రి ఈ బ్రేకుల‌ను జ‌య‌దేవ్ చిత్తు చేస్తారా ?  లేదా ? 23న తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: