నిమిషం నిమిషానికి ప‌ల్స్ రేటు పెరిగిపోతోంది. ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు ?  గెలుస్తార‌ని 42 రోజులుగా క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తోన్న కోట్లాది మంది ప్ర‌జ‌ల‌తో పాటు ఇటు పోటీ చేసిన అభ్య‌ర్థుల ఉత్కంఠ‌కు మ‌రికొద్ది గంట‌ల్లోనే తెర‌ప‌డిపోనుంది. గురువారం మ‌ధ్యాహ్నానికే ఏపీ కొత్త సీఎం ఎవ‌రు ?  మోడీ మ‌ళ్లీ ఢిల్లీ పీఠం ఎక్కుతాడా ?  లేదా ? అన్న‌ది తేలిపోనుంది. ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో ఏపీలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది.


ఏపీలోని అన్ని జిల్లాల‌తో పాటు పొలిటిక‌ల్ కేంద్రాలు అయిన విజ‌య‌వాడ‌, గుంటూరు, వైజాగ్‌తో పాటు మంగ‌ళ‌గిరి కేంద్రంగా బెట్టింగ్ రాయుళ్ల కోట్లాది రూపాయ‌ల బెట్టింగులు వేస్తున్నారు. పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులే కాకుండా రియ‌ల్ట‌ర్లు, సాధార‌ణ ప్ర‌జ‌లు, ఇటు పార్టీల సానుభూతి ప‌రులు కూడా త‌మ స్థాయిని బట్టి బెట్టింగ్ వేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌కు ముందు వ‌ర‌కు హ‌డావిడి చేసిన టీడీపీ వాళ్లు ఎగ్జిట్‌పోల్స్ త‌ర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.


ఇక ఇప్పుడు టీడీపీ వాళ్లు త‌మ‌కు అనుకూల నియోజ‌క‌వ‌ర్గాల మీద మాత్ర‌మే పందేలు కాస్తూ సేఫ్ గేమ్ ఆడేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ పోటీ చేస్తోన్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం మీద కోట్లాది రూపాయ‌ల బెట్టింగ్‌లు న‌డుస్తున్నాయి. మంగళగిరిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి బ‌రిలో ఉన్నారు. రాజ‌ధాని ఏరియా కావ‌డంతో చంద్ర‌బాబు సులువుగా గెలిచేస్తాం అనుకుని లోకేష్‌ను పోటీ చేయించారు.


తీరా లోకేష్ అక్క‌డ నామినేష‌న్ వేశాక కాని మంగ‌ళ‌గిరిలో పోటీకి దిగి ఎంత త‌ప్పు చేశాం ? అన్న విష‌యం వాళ్ల‌కు అర్థం కాలేదు. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి బ‌లంగా ఉన్నారు. ఐదేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ఆయ‌న చేసిన పోరాటాలే ఆయ‌న‌కు ప్ల‌స్ అయ్యాయి. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్‌ను ఎలాగైనా ఓడించాల‌ని వైసీపీ అధిష్టానం వేసిన ప్ర‌ణాళిక‌లు, ఇక్క‌డ వైసీపీ గెలుపుకోసం ఇత‌ర‌త్రా అందిన స‌హ‌కారాల‌తో వైసీపీ గెలిచే స్థితికి చేరుకుంది. 


ఇటు చంద్ర‌బాబుతో పాటు త‌న‌యుడు లోకేష్ బాబు ప్రతిష్ట, టీడీపీ భవిష్యత్ లీడర్ అన్న కారణంగా మంగళగిరి స్థానంపై అత్యధికంగా బెట్టింగ్ లు కాస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా లోకేష్ ఇక్క‌డ వైసీపీ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొన్న మాట వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే లోకేష్ గెలుపు క‌ష్టం అన్న టాక్‌తో అటు టీడీపీ, ఇటు వైసీపీ వ‌ర్గాలు రాష్ట్ర వ్యాప్తంగానే ఈ సీటుపై కోట్లాది రూపాయ‌లు బెట్టింగ్‌ల‌కు కుమ్మ‌రిస్తున్నాయి. ఇక న‌గ‌రిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, విజయవాడలో పీవీపీ వర్సెస్ కేశినేని నాని, గుంటూరులో గల్లా జయదేవ్ గెలుపుపై, విశాఖ నార్త్ లో గంటా శ్రీనివాస‌రావు, మైల‌వ‌రం, గుడివాడ స్థానాల‌పై ఏపీలో జోరుగా బెట్టింగ్ జరుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: