కౌంటింగ్ కౌంట్‌డౌన్ అన్ని వ‌ర్గాల్లోనూ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. 23వ తేదీ వైపే అంద‌రి చూపు ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలంగాణ రాష్ట్ర సీఈఓ రజత్ కుమార్ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.  కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. `` తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలకు జరిగాయి. మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.8 గం.లకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.  35 లొకేషన్స్ లో 119 నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశాం. హైదరాబాద్‌లో 7, సికింద్రాబాద్‌లో 6 చోట్ల కౌంటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 8గంటలకు పోస్టల్ బ్యాలెట్.. మొదట లెక్కిస్తారు. 8.25గంట‌ల‌కు ఈవీఎంలు లెక్కిస్తాం. ప్రతి హాల్ లో 14 టేబుల్స్ పెడుతున్నాం. నిజామాబాద్ లో రెండు హాల్స్ లో 18టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వివిప్యాడ్ లు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 5 లెక్కిస్తాం. ఈవీఎంలు ట్యాలి చేస్తాం.. ట్యాలి కాకపోతే వివిప్యాడ్ లను రీకౌంట్ చేస్తాం.`` అని వెల్ల‌డించారు.


వివిప్యాడ్ కౌంటింగ్ డిమాండ్ ఎక్కువగా వస్తుందని ర‌జ‌త్ కుమార్ పేర్కొన్నారు. ``రూల్ 56 డి కింద రీ కౌంటింగ్ అనేది వివిప్యాడ్ కు మాత్రమే ఉంటుంది. రీ కౌంటింగ్ కోసం ఆర్వోకు రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. ఈవీఎంలకు, వివిప్యాడ్ లకు కౌంటింగ్ లో తేడా వచ్చిన సందర్భం ఇంతవరకు లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భం ఉంది. కౌంటింగ్ లో 6,500 సిబ్బంది ఉన్నారు.. నిజామాబాద్ లో అదనపు సిబ్బందిని పెట్టాం. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసాం. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెల్స్ పెట్టాం. సువిధ పోర్టల్ లో ఫలితాలు ఇస్తున్నాం. కౌంటింగ్ కేంద్రం లోపలికి కెమెరాలు తీసుకెళ్లవచ్చు. కౌంటింగ్ సందర్భంగా సెలవు ప్ర‌క‌టించాం`` అని తెలిపారు. 


ఇదిలాఉండగా, ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నంకల్లా 15 రౌండ్లు పూర్తిచేసే అవకాశం ఉండటంతో ఫలితాలపై ఒక అంచనాకు రావచ్చని తెలుస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో 15 నుంచి 20 రౌండ్లలోనే ఫలితాలు తేలిపోనున్నాయి. అయితే వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితం కొంత ఆలస్యం కానున్నట్టు అధికారులు చెప్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో 14 లెక్కింపు టేబుళ్లతోపాటు, రిటర్నింగ్ అధికారికి ఓ టేబుల్ ఉంటుంది. కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ప్రతి అభ్యర్థికి టేబుల్‌కు ఒక ఏజెంట్ చొప్పున 15 మంది ఏజెంట్లకు అనుమతి ఉంటుందని, వీరందరికీ గుర్తింపుకార్డులు జారీచేస్తున్నట్టు ఈసీ పేర్కొన్నది. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5.30 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్‌రూంలు తెరువనున్నట్టు అధికారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: