దేశ రాజ‌ధాని ఢిల్లీ రాజ‌కీయాల‌తో ప్ర‌భావితం అయ్యే  రాష్ట్రాల్లో ఒక‌టైన హర్యానాలో బహుముఖ పోరు ఆసక్తిని రేకెత్తించిన‌ప్ప‌టికీ...తుది ఫ‌లితాల్లో బీజేపీ ముందంజ‌లో ఉంది. 10 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో అన్నింటా బీజేపీ ముందంజ‌లో ఉంది. మే 12న ఎన్నికలు జరిగిన ఈ రాష్ట్రంలో ఫ‌లితాలు తాజాగా వెలువ‌డ్డాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా కారణంగా రాష్ట్రంలో బీజేపీ అత్యధికంగా 7 స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా ప‌ది స్థానాల్లో గెలుపు ఖ‌రారు దిశ‌గా ఉంది.
 
బీజేపీ విజ‌యానికి అనేక కార‌ణాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతర్గత పోరుతో కాంగ్రెస్ పార్టీ, ఐఎన్‌ఎల్డీ సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ తన్వర్, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. తన్వర్‌ను తొలిగించాలని హుడా వర్గం డిమాండ్ చేస్తున్నది. పార్టీలో ఎవరికి వారుగా వ్యవహరించడంతో ఇటీవల జరిగిన జింద్ శాసనసభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రణ్‌దీప్ సూర్జేవాలా మూడో స్థానానికి పరిమితమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తారా అన్న అనుమానమే నిజ‌మైంది.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్‌ఎల్డీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విశేష ప్రజాదరణ కలిగిన చౌతాలా.. టీచర్ రిక్రూట్‌మెంట్ కేసులో దోషిగా తేలడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుండగా, ఆయన ఇద్దరు కుమారులు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలా విడిపోయారు. 
మాజీ ఉపప్రధాని దేవీలాల్ నెలకొల్పిన ఐఎన్‌ఎల్డీ గత డిసెంబర్‌లో చీలిపోయింది. అజయ్ చౌతాలా కుమారులైన దుష్యంత్, దిగ్విజయ్.. జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ) పేరిట కొత్త పార్టీని స్థాపించారు. జింద్ ఉప ఎన్నికలో ఐఎన్‌ఎల్డీ కంటే జేపీపీనే ఎక్కువ ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు బీజేపీ తిరుగుబాటు ఎంపీ రాజ్‌కుమార్ సైనీ లోక్‌తంత్ర సురక్ష పార్టీ (ఎల్‌ఎస్పీ) పేరిట కొత్త పార్టీ నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, ఎల్‌ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి.  ఇలా విప‌క్షాలు చీలిపోవ‌డంతో...బీజేపీకి గెలుపు సుల‌భ‌మైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: