కర్ణుడి చావుకు కారణాలు అనేకం.. అలాగే తాజా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికీ కారణాలు కోకొల్లలు.. అయితే అన్నింటికన్నా మిన్నగా చంద్రబాబుకు చేటు చేసింది కమ్మ కుల ఆధిపత్యమే అంటున్నారు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ. 


చంద్రబాబు మొదట్లో అన్ని కులాలను సమంగా ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వచ్చారని జేపీ వివరించారు. కానీ 2014 తర్వాత చంద్రబాబు కమ్మ కులానికి విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన చాలా బలంగా వినిపించిందంటున్నారు జయప్రకాశ్ నారాయణ. ఇది మిగిలిన సామాజిక వర్గాలను టీడీపీకి దూరం చేసిందని విశ్లేషించారు. 

అంతే కాదు.. కృష్ణా, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకోవడం.. అక్కడ కులాధిపత్యం ఉండటం.. ఆ కులానికి సంబంధించిన కొందరు మూర్ఖంగా ఆధపత్య ధోరణి చూపించడం.. తెలుగుదేశానికి విపరీతంగా నష్టం చేసిందని చెబుతున్నారు. ఈ కారణాల వల్ల కమ్మ కులానికి వ్యతిరేకంగా మిగిలిన కులాలు ఏకమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు జేపీ. 

సమాజంలో అన్ని కూలాలను కలుపుకుపోవాల్సిన పార్టీలు.. ఇలా ఓ కుల ఆధిపత్యంలో నడవడం మంచిదికాదన్నారు జేపీ.. రాజకీయ పార్టీలు సమాజాన్ని కలిపేలా ఉండాలి తప్ప.. విభజించేలా ఉండకూడదని హితవు పలికారు. చంద్రబాబు కమ్మ వర్గానికి అధికప్రాధాన్యమిస్తున్నారన్న వాదన జనంలోకి చాలా బలంగా వెళ్లిందని జేపీ గుర్తు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: