ఏపీ అసెంబ్లీలో ఈ సారి వైసీపీ నుంచి నారిమ‌ణులు ప్ర‌భంజ‌నం క్రియేట్ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ 15 మందికి, టీడీపీ 19 మంది మహిళలకు టికెట్లు కేటాయించాయి. వైసీపీ నుంచి పోటీచేసిన 15 మందిలో 13 మంది విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన 19 మందిలో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని ఒక్కరే విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన మ‌హిళ‌ల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి రెడ్డిశాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి ఉన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని  కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి రెండోసారి గెలిచారు.

                                                                               

ఇక విశాఖ జిల్లాలోని పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, తూర్పుగోదావ‌రి జిల్లా రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి తొలిసారి గెలిచారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత రెండోసారి గెల‌వ‌డంతో పాటు ఆమె మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. ఆమె గ‌తంలో టీడీపీ నుంచి ఓ సారి గెలిచారు. ఇక గుంటూరు జిల్లాలో వైసీపీ నుంచి ఏకంగా ముగ్గురు మ‌హిళ‌లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు.  ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, తాడికొండ (ఎస్సీ) నుంచి శ్రీదేవి గెలిచారు. వీరిలో సుచ‌రిత‌కు ఇది మూడో గెలుపు.


క‌ర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, అనంత జిల్లా సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ, చిత్తూరు జిల్లా నగరి నుంచి ఆర్‌.కె. రోజా గెలిచారు. రోజాకు ఇది వ‌రుస‌గా రెండో గెలుపు. విశాఖపట్నం తూర్పు నుంచి ఎ.విజయనిర్మల, పెద్దాపురం నుంచి తోట వాణి ఓడిపోయారు. అలాగే అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి సత్యవతి, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వంగా గీత, అరకు లోక్‌సభ స్థానం నుంచి గొడ్డేటి మాధవి, అమ‌లాపురం నుంచి చింతా అనూరాధ‌ విజయం సాధించారు. ఇక టీడీపీ త‌ర‌పున రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భ‌వానీ గెలిచి ఆ పార్టీ త‌ర‌పున ఏకైక మ‌హిళా ఎమ్మెల్యేగా నిలిచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: