ఏపీలో రాజ‌కీయ సునామి దెబ్బ‌కు మ‌హామ‌హులు కొట్టుకుపోయారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఆ పార్టీ వాళ్లే ఊహించ‌ని విధంగా ఏకంగా 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు వ‌చ్చాయి. టీడీపీ కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. వైఎస్ జ‌గ‌న్ సునామీ దెబ్బ‌కు ఏకంగా ముగ్గురు మంత్రులు మిన‌హా మిగిలిన వారంద‌రూ ఓడిపోయారు. ఇక ఈ ప్రభంజనం తెలుగు గ‌డ్డ‌పై ఓ చ‌రిత్ర‌గా నిలిచిపోనుంది. గ‌తంలో ఈ త‌ర‌హా ప్ర‌భంజ‌నాలు ఒక్క ఎన్టీఆర్‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌య్యాయి. 1983లో ఆయ‌న పార్టీ పెట్టిన‌ప్పుడు.. ఆ త‌ర్వాత నాదెండ్ల భాస్క‌ర‌రావు ప్రభుత్వాన్ని కూల‌గొట్టిన‌ప్పుడు 1985లో ప్ర‌భంజ‌నాలు వ‌చ్చాయి.


ఇక ఎన్టీఆర్ సీఎం ప‌ద‌వి నుంచి దిగిపోవ‌డానికి ముందు జ‌రిగిన 1994 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన విప్లవం మామూలు విప్ల‌వం కాదు. స‌మైక్య రాష్ట్రంలోని 294 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ కేవ‌లం 26 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. నాటి కాంగ్రెస్ మ‌హామ‌హులు, మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు అంతా ఆ ఎన్నిక‌ల్లో సైకిల్ స్పీడ్‌కు కొట్టుకుపోయారు. హ‌స్తం చిత్తు చిత్త‌య్యింది. ఇక ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే ప్ర‌భంజ‌నం ఏపీలో వైసీపీ క్రియేట్ చేసింది.


చంద్ర‌బాబు కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు మిన‌హా మిగిలిన వారంద‌రూ ఓడిపోయారు. ఎమ్మెల్సీగా ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు లాంటి వాళ్లు బ‌తికిపోయారు. ఇక గెలిచిన మంత్రుల్లో నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, గంటా శ్రీనివాస‌రావు, అచ్చెన్నాయుడు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ఒక్క అచ్చెన్నాయుడే 8 వేల ఓట్ల‌తో గెలిచారు.. మిగిలిన ఇద్ద‌రూ చావు త‌ప్పి క‌న్నులొట్టబోయిన చందంగా గెలిచారు. ఇక చంద్ర‌బాబుకే గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఏకంగా 18 వేల ఓట్ల మెజార్టీ త‌గ్గిపోయింది.


ఇక కొన్ని ద‌శాబ్దాలుగా నియోజ‌క‌వర్గాన్ని శాసించిన కీల‌క నేత‌లు, మంత్రులు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట్రావు, ప్ర‌త్తిపాటి పుల్లారావు, న‌క్కా ఆనంద‌బాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి త‌న‌యుడు కేఈ శ్యాంబాబు, మంత్రి భూమా అఖిల ప్రియ‌, మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరాం, జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు జేసీ ప‌వ‌న్ రెడ్డి ఇలా ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు మంత్రులు, సీనియ‌ర్ నేత‌ల వార‌సులు కూడా ఈ ఎన్నిక‌ల్లో కొట్టుకుపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: