తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఐదేళ్ల వ‌ర‌కు ఏపీలో ప్ర‌తిప‌క్షంగా త‌న వాయిస్‌ను అసెంబ్లీలో వినిపిస్తుందా ? ఇప్పుడు ఆ పార్టీ త‌ర‌పున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో రేప‌టి రోజున ఎంత‌మంది టీడీపీ వెంట ఉంటారు ? ఇప్ప‌టికే వ‌య‌స్సు పైబ‌డిన చంద్ర‌బాబుకు అసెంబ్లీలో ఇంత‌మంది త‌క్కువ ఎమ్మెల్యేల‌తో ఫైట్ చేసేంత సామ‌ర్థ్యం ఉందా ?  అన్న ప్ర‌శ్న‌ల‌కు నో అనే ఆన్స‌ర్లే వ‌స్తున్నాయి. ఇక లోకేష్ టీడీపీని ముందుండి న‌డిపిస్తాడ‌న్న న‌మ్మ‌కాలు ఎవ్వ‌రికి లేవు. మంగ‌ళ‌గిరిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్య‌క్తి రేపు ఎమ్మెల్యేగా గెలిచేందుకే ఆప‌సోపాలు ప‌డాల్సిన ప‌రిస్థితి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే వ‌చ్చే రెండేళ్ల‌కు పార్టీ బ‌ల‌ప‌డే ప‌రిస్థితి లేక‌పోతే పార్టీలో నారా నాయ‌క‌త్వంపై తిరుగుబావుటా వేసేందుకు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సిద్ధంగా ఉన్నార‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. మ‌రి కొంద‌రు మాత్రం పార్టీ ప‌గ్గాలు నంద‌మూరి ఫ్యామిలీకి అప్ప‌గించాల‌ని సోష‌ల్ మీడియా సాక్షిగా డిమాండ్ చేస్తున్నారు.


ఇక తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లోనే తాజా ఓట‌మి ఘోరాతి ఘోర‌మైంది. ఆ పార్టీ పుట్టాక 1983 నుంచి 2014 వరకు అసెంబ్లీకి ఎనిమిదిసార్లు ఎన్నికలు జరగగా ఐదుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్‌ నాయకత్వంలో మూడుసార్లు గెలిచింది. కాంగ్రెస్‌ పార్టీ మూడుసార్లు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్ర‌బాబు 1995లో మామ ఎన్టీఆర్ నుంచి ప్ర‌భుత్వాన్ని లాక్కున్నారు. ఆయ‌న సార‌ధ్యంలో పార్టీ కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే 1999, 2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక మాత్ర‌మే గెలిచింది. ఈ రెండు సార్లు కూడా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. వెంక‌య్య‌నాయుడు పుణ్య‌మా ? అని చంద్ర‌బాబు బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ రెండుసార్ల‌లో 1999లో కార్గిల్ వార్ + వాజ్‌పేయ్ సానుభూతి బాబును గ‌ట్టెక్కిస్తే.. 2014లో న‌మోః మోడీ వేవ్‌తో బ‌తికిపోయారు. ఇలా చంద్ర‌బాబు ఎప్పుడూ పొత్తుల‌నే న‌మ్ముకున్నాడే కాని.. ఒంట‌రిగా అధికారంలోకి రాలేదు. ఇక 2009లో కూడా టీడీపీ అత్యంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో 92 సీట్లు గెలుచుకుంది. ఇందుకు కార‌ణం ఉభ‌య‌క‌మ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవ‌డ‌మే.


ఇక చంద్ర‌బాబు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక పార్టీ గ్రాఫ్ క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్న వ‌ర్గాలు దూర‌మ‌వుతున్నాయి. కొత్త వాళ్ల‌ను ఆక‌ర్షించ‌డం పోయి... ఉన్న వాళ్ల‌ను టీడీపీ దూరం చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. అయితే గతంలో ఓట్ల శాతం, సీట్లతో పోలిస్తే చాలా తగ్గాయి. చంద్రబాబు సొంతంగా పార్టీని ఏనాడూ విజయపథంలో నడిపించలేకపోయారు. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు టీడీపీ 216 సీట్ల‌లో గెలిచి 46.21 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో 23 సీట్ల స్థాయికి దిగజారిపోవడం, ఓట్ల శాతం క్షీణించడం పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందనేందుకు నిదర్శనం. 


ఇక గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 1.98 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ ఇప్పుడు ఏకంగా 10 శాతం ఓట్ల‌తో ఘోర ప‌రాజ‌యం పాలైంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడినా 67 సీట్ల‌తో స‌త్తా చాటాడు. ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో చాలా వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదు. దీంతో ఇప్పుడు ప్ర‌జ‌లంతా బాబును చిత్తుగా ఓడించారు. వైసీపీ, టీడీపీ మ‌ధ్య సీట్ల శాతమే కాకుండా ఏకంగా ఓట్ల శాతం కూడా 10.7 శాతం తేడాగా ఉండడం గమనార్హం. వైసీపీకి 1,56,86,511 ఓట్లు (49.95 శాతం) రాగా, టీడీపీకి 1,23,03,620 ఓట్లు (39.18 శాతం) వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: