ఏపీలో హోరాహోరీగా జరిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ రికార్డు స్థాయి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 30న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో, వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నేడు జరిగింది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలంతా నేడు భేటీ అయి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.


ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా వైసీపీ  అండగా నిలిచిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చామ‌ని, 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశామ‌ని వెల్ల‌డించారు. అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనమ‌ని పేర్కొన్నారు. 50 శాతం ఓట్లు కూడా వైసీపీకే పడ్డాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని స్ప‌ష్టం చేశారు. `మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23, ఎంపీలు ముగ్గురు. ఇప్పుడు టీడీపీకి మిగిలింది అదే. చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23. ఎంపీలు మూడు. దేవుడు చాలా గొప్పగా ఈ స్క్రిప్ట్ రాశాడు`` అని వ్యాఖ్యానించారు. 


మన టార్గెట్ 2024 - 2024లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవడ‌మ‌ని వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ``ఈ విజయానికి కారణం నాతోపాటు మీ అందరు కూడా. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారు. 2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలి. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప‌నితీరును చూసి ప్రజలు 2024లో మనకు ఓటెయ్యాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తాను. మామూలుగా ఉండదు ఆ ప్రక్షాళన‌. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన చేస్తా. ఆ ప్రక్షాళనకు మీ అందరి సహాయసహకారాలు కావాలి, అందించాలి. మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తాను. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయ్. వాటిని కూడా క్లీన్‌స్వీప్ చేయాలి. ప్రతీ గ్రామంలోని అక్కచెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు 'అన్నా మీకు మేము తోడుగా ఉన్నాము' అని అన్నారు కాబట్టే నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఎమ్మెల్యేలు అయినా అయింది. ఆ ప్రజలకి ఎప్పుడూ మనం తోడుగా ఉండాలి`` అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: